తప్పొకరిది.. శిక్షొకరికి..

19 Feb, 2015 01:17 IST|Sakshi

ముదురుతున్న మస్తర్ల వివాదం
జీతాల కోసం కార్మికుల పోరుబాట
నేడు కార్పొరేషన్ వద్ద ఆందోళన

 
విజయవాడ సెంట్రల్ : ప్రజారోగ్యశాఖలో మస్తర్ల మస్కా వివాదం ముదిరి పాకాన పడుతోంది. డ్వాక్వా, సీఎంఈవై కార్మికులకు రెండునెలల జీతాలు బిల్లు పెండింగ్ పెట్టడంతో పోరుబాట పట్టాలని నిర్ణయించారు. ఏఐటీయూసీ, సీఐటీయూల ఆధ్వర్యంలో గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు రంగం సిద్ధం చేశారు. మస్తర్లలో మాయ చేసిన అధికారులను వదిలి తమపై ప్రతాపం చూపితే ఎలా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. నగర పర్యటనలో భాగంగా కమిషనర్ డివిజన్లలో పారిశుధ్య కార్మికుల హాజరును నిశితంగా పరిశీలించారు. 30 నుంచి 40 శాతం వరకు కార్మికులు విధులకు గైర్హాజర్ అవుతున్నారని నిర్ధారణకు వచ్చారు. పారిశుధ్య కార్మికులకు బకాయిపడ్డ జీతాలు చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో ప్రజారోగ్య విభాగం అధికారులు హడావిడిగా సుమారు  రూ.2.30 కోట్లు బిల్లు తయారు చేసి కమిషనర్‌కు పెట్టారు. ఇందులో 87 శాతం హాజరు చూపినట్లు తెలుస్తోంది. కార్మికుల హాజరు శాతం తక్కువగా ఉంటే ఇంత మొత్తంలో ఎందుకు బిల్లు పెట్టారో సమాధానం చెప్పాలని కమిషనర్ కొర్రీ రాశారు.  దీంతో బిల్లు కమిషనర్ చాంబర్లో ఆగిపోయింది.  

జీవనం ఎలా

నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో 2,984 మంది డ్వాక్వా, సీఎంఈవై కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కొక్కరికీ నెలకు రూ.8,300 జీతం చెల్లిస్తున్నారు. మస్తర్లలో మాయ చేస్తున్న శానిటరీ మేస్త్రీలు, ఇన్‌స్పెక్టర్లు కాసులు దండుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. రాజకీయ నేతల అండదండలతో కొందరు పైరవీలు సాగిస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా, కార్మికుల జీతాల బిల్లు నిలిపివేయడంతో వారు లబోదిబోమంటున్నారు. నెలల తరబడి జీతాలు పెండింగ్ ఉంటే జీవనం ఎలా సాగిస్తామని ప్రశ్నిస్తున్నారు. విధులకు హాజరవ్వడానికి ఆటోకు డబ్బులు లేని పరిస్థితి నెలకొందంటున్నారు. ఇళ్ల అద్దెలు చెల్లించపోవడంతో యజమానులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది సరైన చర్య కాదు

మస్తర్లలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలే తప్ప కార్మికుల జీతాలు నిలిపివేయడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు ఆసుల రంగనాయకులు పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరుతూ ఆందోళన చేపడుతున్నామన్నారు. బ యోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తే అక్రమాలకు చెక్ పెట్టొచ్చన్నారు. అవి నీతికి పాల్పడుతున్న అధికారులపై చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా