ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాలింత మృతి

22 Jul, 2019 03:35 IST|Sakshi
భార్య మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త శివప్రసాద్‌ (ఇన్‌ సెట్‌లో) సుకన్య ప్రసవించిన పాప

కుటుంబసభ్యులు, బంధువుల రాస్తారోకో 

అనంతపురం జిల్లాలో ఘటన

అనంతపురం న్యూసిటీ: ఓ బాలింత మృతి వివాదాస్పదంగా మారింది. రక్తం ఎక్కించే సమయంలో పొరపాటే ఇందుకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది. శింగనమల మండలం ఆకులేడుకు చెందిన ఎం.సుకన్య(26)ను రెండో కాన్పు కోసం ఈ నెల 17న సర్వజనాస్పత్రిలో చేర్చారు. ఈ నెల 19న ఆమెకు సిజేరియన్‌ చేయగా ఆడపిల్ల జన్మించింది. అదే రోజు ఓ–నెగిటివ్‌ రక్తం ఎక్కించారు. సుకన్యకు యూరిన్‌ రాకపోవడంతో వైద్యులు పరీక్షించి.. నెఫ్రాలజీ సేవలు అవసరమని కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు. భర్త శివప్రసాద్, కుటుంబ సభ్యులు ఆమెను 20వ తేదీ కర్నూలు ఏఎంసీకి తీసుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె మరణించింది. 

వందలాదిమందితో ఆందోళన: కర్నూలులోని కొందరు ఆస్పత్రి సిబ్బంది రక్త మార్పిడి సరిగా జరగలేదని చెప్పారని.. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు వందలాదిమందితో ఆదివారం రాత్రి సర్వజనాస్పత్రి ఎదుట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రక్తమార్పిడిపై అనుమానం ఉంటే పోస్టుమార్టం చేస్తే తెలుస్తుందని ఆర్‌ఎంవో డాక్టర్‌ లలిత చెప్పారు. ఇదే విషయమై గైనిక్‌ హెచ్‌ఓడీలు డాక్టర్‌ షంషాద్‌బేగం, డాక్టర్‌ సంధ్యలను ‘సాక్షి’ ఆరా తీయగా.. సుకన్యకు ఆమె గ్రూపు రక్తం(ఓ–నెగిటివ్‌) ఎక్కించామని, యూరిన్‌ రాకపోవడంతో కర్నూలుకు రిఫర్‌ చేసినట్టు వివరించారు. 

మరిన్ని వార్తలు