పీలేరులో బాలింత మృతి

2 Jul, 2016 02:56 IST|Sakshi
పీలేరులో బాలింత మృతి

* ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన     
* వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణ

పీలేరు : వైద్యులు ఆపరేషన్ చేసిన తరువాత మగబిడ్డను ప్రసవించిన కొంతసేపట్లోనే బాలింత మృతి చెందింది. పీలేరు పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి గురువారం రాత్రి కాన్పుకోసం గర్భిణి రాగా, రాత్రి 10-45 గంటల ప్రాంతంలో ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. మగ బిడ్డను ప్రసవించిన ఆమె మరికొన్ని గంటల్లోనే మరణించింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు.  

బాదితుల కథనం మేరకు కేవీపల్లె మండలం గువ్వలగుడ్డం గ్రామానికి చెందిన సీ. సుధాకర్‌రెడ్డి వాల్మీకిపురంలో ట్రాన్స్‌కోలో లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. పీలేరు పట్టణం కావలిపల్లెలో కాపురం ఉంటున్నారు. సుధాకర్‌రెడ్డి భార్య కుమారి(30)ని కాన్పు కోసం గురువారం రాత్రి 10 గంటల సమయంలో పట్టణంలోని గుప్త ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు రాత్రి 10.45 గంటలకు ఆపరేషన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు.

అనంతరం రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఉందని ఆమె భర్తకు చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యమే అంబులెన్స్‌లో తిరుపతిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి పంపించారు. అక్కడికెళ్లగానే పరీక్షించిన డాక్టర్లు ఆమె మృతి చెందిందని చెప్పారు. దాంతో ఆమె బంధువులు,కుటుంబసభ్యులు పీలేరు ఆస్పత్రి వద్దకు చేరుకుని శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆపరేషన్‌లో తేడా రావడంవల్లే ఆమె చనిపోయిందని, ఆ విషయం బయటకు పొక్కనీయకుండా హడావుడిగా తిరుపతికి పంపేశారని ఆరోపించారు.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రిపై దాడికి యత్నించారు. ఆందోళనకారులు, ఆస్పత్రి యాజమాన్యంతో పోలీసులు, ఇతర పెద్దలు చర్చించి గొడవను సద్దుమణిచారు. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపేశారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఆస్పత్రి వద్ద ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
తీవ్ర రక్తస్రావంతోనే మృతి
రిస్క్ కేసు అయినందున ఆపరేషన్ కేసి ఉండకూడ దు. ఈ కేసును మెటర్నటీ, సీఎంసీకి రెఫర్ చేసి ఉండాలి. సాహసం చేసి ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగిం చారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమె మృతి చెందింది. సంఘటనపై ప్రాథమిక విచారణ చేసి నివేదికను జిల్లా కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌వోకు అందజేస్తాను. మృతురాలి బంధువులు, డాక్టర్, నర్సులను విచారించాల్సి ఉంది.
- అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటప్రసాద్

మరిన్ని వార్తలు