తల్లుల మరణాల నియంత్రణ శూన్యం

11 Nov, 2019 05:19 IST|Sakshi

‘శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే’ బులెటిన్‌లో వెల్లడి 

కేరళలో లక్షకు 42 మంది తల్లుల మృతి.. ఏపీలో 74 మంది

సాక్షి, అమరావతి:  ప్రసవం లేదా గర్భిణీగా ఉన్న సమయంలో తల్లుల మరణాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తగ్గగా.. ఆంధ్రప్రదేశ్‌లో 2014–17 మధ్య కాలంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌) విడుదల చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా మాతా శిశు మరణాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, అందుకు కేంద్రం సహకరిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు పిలుపునిచ్చినా అప్పటి చంద్రబాబు సర్కారు పెద్దగా స్పందించకపోవడాన్ని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2015–17 మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో మాతా మరణాల నియంత్రణ (మెటర్నల్‌ మోర్టాలిటీ రేట్‌–ఎంఎంఆర్‌)పై ఎస్‌ఆర్‌ఎస్‌ బులెటిన్‌ రూపొందించింది.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2014 –16 మధ్యకాలానికి ఇచ్చిన బులెటిన్‌కూ.. 2015–17 కాలానికి ఇచ్చిన బులెటిన్‌కూ మరణాల్ని నియంత్రించడంలో ఎలాంటి వృద్ధి కనిపించలేదని వెల్లడించింది. 2014–16లో సగటున లక్ష మందికి 74 మంది మృతి చెందగా.. 2015–17 కాలానికి అదే రేటు కొనసాగింది. చాలా రాష్ట్రాల్లో 2014–16, 2015–17 మధ్య కాలానికి విడుదల చేసిన సూచీల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది.  

నియంత్రించిన మిగతా దక్షిణాది రాష్ట్రాలు 
2015–17 మధ్య మాతా మరణాలపై ఈనెల 7న ఎస్‌ఆర్‌ఎస్‌ బులెటిన్‌ విడుదల చేసింది. పక్క రాష్ట్రం తెలంగాణలో 2014–16లో ప్రతి లక్ష మందికి 81 మరణాలు నమోదు కాగా.. 2015–17 కాలానికి ఆ సంఖ్య 76కు తగ్గింది. కర్ణాటకలో 108 నుంచి 97కి నియంత్రించగా.. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఎప్పటిలానే తాజా సర్వేలోనూ మరింతగా మరణాల నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మందికి 130 మరణాలు చోసుచేసుకుంటుండగా.. ఆ సంఖ్య 2015–17 సర్వేలో 122కు తగ్గింది. మన రాష్ట్రంలో ఎలాంటి తగ్గుదల లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జాతీయ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసినా మార్పు రాలేదని, దీనిపై గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా