నా పేరు కార్మికుడు.. నా ఇల్లు పరిశ్రమ..

1 May, 2018 12:38 IST|Sakshi
విజయవాడ: వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మేడే వేడుకలు

ప్రపంచ కార్మిక దినోత్సవం.. పీడిత జాతికి మహోత్సవం!

శ్రమను గౌరవిద్ధాం, శ్రమను గుర్తిద్దాం, శ్రమ చేద్దాం

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మేడే దినోత్సోవం

అగ్గిపుల్ల, సబ్బుబిల్ల కాదేది కవిత్వంకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ.  మరి ఆ అగ్గిపుల్లను, సబ్బుబిల్లను తయారు చేసే కార్మికుడు కవిత్వం కంటే గొప్పవాడు కావచ్చు. తానుంటేనే నేనుంటానంటది ఫ్యాక్టరీ.. తానుంటేనే నేను నిలబడతానంటది దేశం.. తానుంటేనే నేనని ఒకటి ఉంటుందంటది వస్తువు...తానే నేను..నేనే తానంటది యంత్రం... తనెవరో కాదు కష్టాన్ని ఖార్ఖానాలో, జీవితాన్ని యంత్రంతో ముడివేసుకున్నవాడు...అందరివాడు..మనందరివాడు...అతడే ఒక కార్మికుడు. నా పేరు కార్మికుడు.. నా ఇల్లు పరిశ్రమ..నా పరిశ్రమే నా పరిశ్రమకు ఊతం.. ఇది నాకు గర్వం.. నేడు మేడే సందర్భంగా దేశం మొత్తం తన కష్టాన్ని గుర్తు చేసుకుంటుంది.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా మేడే వేడుకులను నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌లో...
విజయవాడ: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్‌, శివరామకృష్ణ పాల్గొన్నారు.

అనంతపురం : జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా మేడే  వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అనంతపురం అర్భన్ నియోజకవర్గ సమన్వయకర్త నదీంఅహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కార్మికుల శ్రమను గుర్తించాలని, వారిని నిర్లక్ష్యం చేస్తే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు.

ప్రకాశం : ఒంగోలు వైస్సార్‌సీపీ కార్యాలయంలో వైస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల దినోత్సవ వేడుకలు జరిగాయి.  జిల్లా వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు కేవీ ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి , రాష్ట్ర వైస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వేమూరి బుజ్జి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు వామపక్ష ,కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు.

వైఎస్సార్ జిల్లా :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్మికుల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.  

వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మేయర్ సురేష్ బాబు, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, కార్మికులు పాల్గొన్నారు.

తెలంగాణలో..

హైదరాబాద్‌: నగరంలో మే డే వేడుకలను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలతోపాటు అన్ని పార్టీలు నిర్వహించాయి. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు మే డే సందర్భంగా ఎండా ఎగురవేసి.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్మికుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటామని తెలిపారు. తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారావు ప్రభుత్వం తరఫున మేడే ఉత్సవాల్లో పాల్గొన్నారు.
 

హైదరాబాద్‌లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లోటస్ పాండ్లో వైఎస్సార్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు నిర్వహించారు. వైయస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు భూమి రెడ్డి ఓబుల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ టీయూసీ జెండా ఎగురవేశారు. అనంతరం కార్మిక రంగంలో విశిష్ట సేవలందించిన వారికి వారి సేవలను గుర్తించి వైయస్సార్టీయూసీ మెమెంటోలు అందజేసారు. అనంతరం  రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ గారు కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం వైఎస్సార్టీయూసీ ఎల్లప్పుడూ కార్మికులకు అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.

కామారెడ్డి : బాన్సువాడ మండలంలో ఘనంగా మేడే వేడుకలు జరిపారు.  కార్యక్రమంలో జెండాను ఎగురవేశారు. కార్మికులు, సీపీఐ, సీపీఎం నాయకులు ర్యాలీ నిర్వహించారు.

నల్లగొండ : నాగార్జున సాగర్‌లో  మేడే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం జెండాను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి,  నాగార్జున సాగర్ టిఆర్ఎస్‌ ఇంచార్జ్ నోముల నరసింహయ్య, కార్మికులు పాల్గొన్నారు.

కరీంనగర్ : జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి లో సహకార సంఘం ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ఈటల రాజేందర్  పెట్రోల్ బంకును ప్రారంభించారు.

మరిన్ని వార్తలు