పదో తరగతిలో ‘మాయాబజార్’పాఠం

3 Jun, 2014 09:01 IST|Sakshi
పదో తరగతిలో ‘మాయాబజార్’పాఠం

పదవతరగతి కొత్త సిలబస్‌లో భారతీయ సినిమా విశేషాలను పాఠ్యాంశాలుగా చేర్చడం పలువురిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాయాబజార్ చిత్రం, సినీనటి సావిత్రి జీవిత విశేషాలను ఇంగ్లిషులో పాఠ్యాంశాలుగా పొందుపరిచారు. 2014-15 విద్యా సంవత్సరంలో అమలులోకి రానున్న నూతన సిలబస్‌లో భాగంగా కొత్త పాఠ్యపుస్తకాలను మల్టీకలర్ బొమ్మలతో ఆకర్షణీయంగా రూపొందించారు. తెలుగు పాఠ్యపుస్తకాన్ని ‘తెలుగుదివ్వెలు-2’పేరుతో ముద్రించారు. ఉపవాచకంలో రామాయాణాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఆరు కాండలపై ఇందులో వివరించారు. ఇంగ్లిషు పాఠ్యపుస్తకంలో భారతీయ సినిమాలను వివరించారు.
 
 వ్యక్తిత్వం పెంపు , హాస్యచతురత, హ్యుమన్ రిలేషన్, ఫిలిం అండ్ థియేటర్, బయోడైవర్శిటీ తదితర అంశాల్లో స్ఫూర్తినిచ్చే కథనాలతో పాటు పర్యావరణంపై కూడా దీనిలో చర్చించారు. జీవశాస్త్రంలో పాఠ్యాంశాన్ని చదవడం, చెప్పించడంతో పాటు ప్రయోగాలు, క్షేత్రపర్యటనలు తదితర అంశాలతో పాటు బోధన - అభ్యసన ప్రక్రియ మరింత మెరుగుపడేలా పాఠ్యాంశాలను రూపొందించారు. శిశువికాసం దశలు, మానవ శరీర నిర్మాణం, గుండె నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించే విధంగా పాఠాలను రూపొందించారు.
 
 సాంఘికశాస్త్రం గతంలో నాలుగు విభాగాలు భూగోళం, చరిత్ర, పౌర, అర్థశాస్త్రాలుగా ఉండేది. కొత్త సిలబస్‌లో వీటిని ఒకే విభాగంగా మార్చారు. వనరుల అభివృద్ధి -సమానత ఒక భాగంగా, సమకాలీన ప్రపంచం-భారతదేశం రెండోభాగంగా ఏర్పాటు చేశారు. బజారు, పంచాయతీ, పల్లెసీమల్లోని పొలాలు, వస్తు ప్రదర్శనలు తదితర వాటిని తెలుసుకునేలా ఈ పుస్తకం ఉంది. విద్యార్థులు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ పాఠ్యపుస్తకాలు దోహదం చేస్తాయని  ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
 

మరిన్ని వార్తలు