మన్యంలో బ్యాంకు సేవల విస్తరణ

2 Sep, 2014 01:02 IST|Sakshi
  •     గిరిజనులకు మేలు
  •      ఫలించిన ఐటీడీఏ పీవో కృషి
  • పాడేరు: గతంలో బ్యాంకు సేవలు పొందడానికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వ పథకాల రాయితీలు, పంట నష్టం, కాఫీ ప్రోత్సాహక నిధులు పొందడానికి బ్యాంకు ఖాతాలు తప్పనిసరి చేయడంతో వాటి కోసం అవస్థలు ఎదుర్కొనేవారు. జీకేవీధి, ముంచంగిపుట్టు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లో బ్యాంకులే లేనిపరిస్థితి. దీంతో మండలాలను దాటుకొని వెళ్ళి బ్యాంకు ఖాతాలకు రోజుల తరబడి తిరిగే వారు. దీనిని గుర్తించిన ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ ఆరు నెలల నుంచి ఏజెన్సీలో బ్యాంకు సేవల విస్తరణకు చర్యలు చేపట్టారు.

    ఏజెన్సీలో జాతీయ బ్యాంకుల ఏర్పాటు చేస్తే ఐటీడీఏ మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, ఆయా బ్యాంకుల అధికారులతో పీవో పలు దఫాలుగా జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఏజెన్సీలో అన్ని మండలాల్లోను జాతీయ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే జీకేవీధిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంచంగిపుట్టులో విశాఖ గ్రామీణ బ్యాంకులుండగా, డివిజన్ కేంద్రం పాడేరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా బ్యాంకు సేవలను అందుబాటులో తెచ్చారు.

    పలు మండలాల్లో ఈ రెండు బ్యాంకుల శాఖల ఏర్పాటు కానున్నాయి. డుంబ్రిగుడలో ఆంధ్రా బ్యాంకు, జి.మాడుగులలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల ఏర్పాటుకు ఐటీడీఏ భవనాలను సమకూర్చింది. మరోవైపు ఏజెన్సీలో పిప్పళ్ళు, కాఫీ, మిరియాలు, అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ విఫణిలో మంచి స్థానం ఉన్నా జాతీయ బ్యాంకుల సేవలు విస్తరణకు నోచుకోక గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.

    ప్రతి గిరిజన రైతుకు బ్యాంకు అకౌంట్ ద్వారానే ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహక నిధుల పంపిణీ, వికలాంగ పింఛన్లు, ఉపాధి కూలీల సొమ్ము చెల్లింపులుంటాయని ఐటీడీఏ బ్యాంకు సేవల విస్తరణ చర్యలు చేపట్టింది. కొత్త బ్యాంకుల రాకతో బ్యాంకు ఖాతా కల నెరవేరబోతుందని గిరిజనులు సంబరపడుతున్నారు.  
     
     ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా
     ప్రతి గిరిజన కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో జాతీయ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. ఆర్థిక సంస్థల సేవలు అందుబాటులోకి రావాలి. సమాజంలో అసమానతలు తొలగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిస్తున్న అన్ని రాయితీలు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారానే లబ్దిదారులకు చేరాలి. బ్యాంకు ఖాతా ఉంటే అవినీతి, అక్రమాలకూ అడ్డుకట్ట వేయవచ్చు. -వి.వినయ్‌చంద్,
     ఐటీడీఏ పీవో, పాడేరు
     

మరిన్ని వార్తలు