నాకు తెలియాలి!

25 Jun, 2016 03:08 IST|Sakshi
నాకు తెలియాలి!

కార్పొరేషన్ వ్యవహారాలపై మేయర్, కమిషనర్‌కు మంత్రి నారాయణ ఆదేశం
►  మంత్రిపై సీఎం అసహనం నేపథ్యంలో టెలి కాన్ఫరెన్స్

 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇక మీదట ఏ నిర్ణయాలైనా నాకు  చెప్పే తీసుకోవాలని మంత్రి నారాయణ మేయర్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లుకు స్పష్టం చేశారు. ఒక వైపు సొంత పార్టీ నేతల అవినీతి ఆరోపణలు, మరో వైపు ఏసీబీ దాడులతో జిల్లాలో పార్టీ పరువు పోయిందనీ, సొంత కార్పొరేషన్‌లోనే పరిస్థితి అదుపులో పెట్టక పోతే రాష్ట్రం మొత్తం ఎలా పాలన సాగిస్తావని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నారాయణ శుక్రవారం విజయవాడ నుంచి మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లుతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో ఒక ఇంటి నిర్మాణ అనుమతి కోసం అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) మునిరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.

ఈ లంచాల్లో  కమిషనర్ నుంచి కింది స్థాయి వరకు అందరికీ వాటాలు ఉన్నట్లు ఏసీపీ ఏసీబీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ వివాదం కాస్తా మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి బహిరంగ యుద్ధానికి దారి తీసింది. నగరంలో ముస్లిం మైనారిటీలు సైతం వీధికెక్కి వివేకా మీద విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంతో  జిల్లాలో పార్టీ పరువు బజారున పడింది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబుదృష్టికి వెళ్లింది. జిల్లాలో పార్టీ అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు, అవినీతి వ్యవహారాల వల్ల జనంలో మరింత పలుచబడి పోతుందని మంత్రి నారాయణమీద సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు మూడు రోజుల కిందటే టీడీపీ వర్గాల్లో చర్చ నడిచింది. రాజధాని వ్యవహారాల్లో  తీరిక లేకుండా ఉన్నప్పటికీ  సంబంధిత శాఖ మంత్రిగా సొంత కార్పొరేషన్‌నే అదుపులో పెట్టలేక పోతే ఎలా అని మంత్రి మీద చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.


 నారాయణ చేతిలోకి కార్పొరేషన్
 నెల్లూరులో తాజా పరిణామాలు, సీఎం చంద్రబాబు స్పందన నేపథ్యంలో కార్పొరేషన్ వ్యహారాలను తన చేతిలోకి తీసుకోవాలని మంత్రి నారాయణ నిర్ణయించారు. శుక్రవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి మేయర్ అజీజ్, కమిషనర్ వెంకటేశ్వర్లుతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్పొరేషన్‌లో ఇక మీదట ఏ నిర్ణయాలైనా తనకు చెప్పే తీసుకోవాలని ఇద్దరినీ ఆదేశించారు. కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడినా మీ ఇద్దరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సిబ్బంది, అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు గుర్తిస్తే అక్కడికక్కడే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

నెల్లూరును మోడల్  కార్పొరేషన్‌గా తయారు చేయాలని తాను ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఇబ్బందిగా తయారైందని అజీజ్, వివేకా మీద అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. అవినీతిని కట్టడి చేయకపోతే రాజకీయంగా దెబ్బతింటామని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్, డెరైక్టర్ కన్నబాబు టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు