మ్యూటేషన్ తూచ్..!

7 Mar, 2016 03:12 IST|Sakshi

తప్పు తెలుసుకుని వెనక్కి..
ఓపెన్ ఆక్షన్‌పైనేమేయర్ దృష్టి దండిగా ఆదాయం
వస్తుందని అంచనా

 
వస్త్రలతలో ఒక్కో షాపునకు అద్దె రూ.7వేలు చెల్లిస్తున్నారు. రూ.13వేల చొప్పున కట్టాల్సిందిగా నగరపాలక సంస్థ డిమాండ్‌కు వ్యాపారులు స్పందించడం లేదు.ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కో షాపునకు గుడ్‌విల్‌గా రూ.10 లక్షలు చెల్లించేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. మ్యూటేషన్ (పేరు మార్పు) కింద 30 నెలల అద్దె వసూలు చేస్తే ఒక్కో షాపునకు రూ.3 లక్షలు మాత్రమే వసూలవుతోంది.
 
 రాజధాని నేపథ్యంలో విజయవాడలో వ్యాపారాలు పెరిగాయి. షాపులకు డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకోవాలనే యోచనలో పాలకులు ఉన్నారు. ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న మ్యూటేషన్‌కు తూచ్  చెప్పి ఓపెన్ ఆక్షన్ దిశగా పావులు కదుపు తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. న్యాయ, సాంకేతిక ఇబ్బందులపై అధ్యయనం చేసిన తరువాత ఓ నిర్ణయానికి రావాలని మేయర్ కోనేరు శ్రీధర్ అధికారులకు సూచించినట్లు సమాచారం.

 
 
 విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థకు చెందిన 64 షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో 3,400 షాపులు ఉన్నాయి. షాపుల లీజు అగ్రిమెంట్ ఒకరి పేరున ఉంటే ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న వారు మరొకరు. 80 శాతం షాపుల్లో ఇదే పరిస్థితి. ఈ క్రమంలో మ్యూటేషన్ కింద 30 నెలల అద్దె వసూలు చేయాలని, తద్వారా నగరపాలక సంస్థకు సుమారు రూ.3కోట్ల నుంచి రూ.5కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. ఈ ప్రతిపాదనకు మొదట్లో స్టాండింగ్ కమిటీ పచ్చజెండా ఊపింది.

 ఆ తరువాత ఏమైందంటే..
 ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో గుడ్‌విల్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోందని, మ్యూటేషన్ వల్ల నష్టపోతామంటూ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాకుమల్లికార్జున యాదవ్ సూచించారు. దీనిని పెద్దగా పట్టించుకోని మేయర్ కార్పొరేషన్‌కు సంబంధించిన అన్ని షాపుల నుంచి మ్యూటేషన్ వసూలు చేయాల్సిందిగా ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. తొలి విడతగా 547 షాపుల నుంచి 30 నెలల అద్దె వసూలు చేయాలని నిర్ణయించారు. మ్యూటేషన్ పేరుతో కొందరు భారీగా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారంటూ స్టాండింగ్      కమిటీలో రగడ మొదలైంది. ఈ విషయంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీలోని కొందరి పేర్లు వినిపించడంతో అల్లరైపోయింది. దీన్ని తాత్కాలికంగా వాయిదా వేయాల్సిందిగా మేయర్ సూచించారు.

 ఓపెన్ ఆక్షనే బెటర్
ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ పై భాగంలో 111 షాపులు నూతనంగా నిర్మించాలని మేయర్ నిర్ణయించారు. ఇందుకు రూ.11 కోట్లు ఖర్చవుతుందని అంచనా. షాపులు కేటాయించడం ద్వారా వచ్చే గుడ్‌విల్‌తోనే దీనిని నిర్మించాలని నిర్ణయించారు. మార్కెట్ రేటు ప్రకారం ఒక్కో షాపునకు రూ.10 లక్షల వరకు గుడ్‌విల్‌గా చెల్లించేందుకు వ్యాపారులు ముందుకొచ్చారు.   ఆ ప్రాంతంలో గుడ్‌విల్ రూ.10లక్షలు ఉంటే పాత షాపులకు మ్యూటేషన్ కింద రూ.3 లక్షలు వసూలు చేస్తున్నామన్న విషయం అప్పుడు కానీ పాలకులకు బోధపడలేదు. వస్త్రలతలోని 280 షాపులకు ప్రస్తుతం నామమాత్రపు అద్దె మాత్రమే వసూలవుతోంది. ఇదే పరిస్థితి మిగతా షాపింగ్ కాంప్లెక్సుల్లోనూ ఉంది. నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోని    షాపులన్నింటికీ ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తే భారీగా ఆదాయం  సమకూరే అవకాశం ఉందన్నది మేయర్ అంచనా. ఆ దిశగా ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
 
 మామూళ్ల రచ్చ
 మ్యూటేషన్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యులు వర్సెస్ మేయర్ మధ్య     కోల్డ్‌వార్ జరుగుతోంది. చేయి చాస్తున్నారని పరస్పర ఆరోపణలు గుప్పిం చుకున్నారు. చివరికి ఈ మామూళ్ల వ్యవహారం పార్టీ అధిష్టానం వరకూ వెళ్లింది. స్టాండింగ్ కమిటీ సభ్యులే స్వయంగా  మేయర్‌పై ఎంపీ, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేయడంతో రచ్చ బహిర్గతమైంది. ఈ పరిణామాల  నేపథ్యంలో మ్యూటేషన్‌ను పక్కన పెట్టేసి ఓపెన్ ఆక్షన్‌కు వెళ్లడం ద్వారా కార్పొరేషన్‌కు ఆదాయంతో పాటు పార్టీలో ప్రత్యర్థుల్ని దెబ్బతీయొచ్చ న్నది మేయర్ వ్యూహంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆచరణలో ఇది    ఎంతమేర సాధ్యమవుతుందో వేచి చూడాలి.
 

మరిన్ని వార్తలు