మేయర్ వర్సెస్ కమిషనర్

5 Apr, 2016 01:41 IST|Sakshi

కౌన్సిల్ సాక్షిగా విభేదాలు బహిర్గతం

 

కార్పొరేషన్ మేయర్, కమిషనర్ మధ్య సాగుతున్న కోల్డ్‌వార్ కౌన్సిల్ సాక్షిగా బహిర్గతమైంది. మున్నెన్నడూ లేని విధంగా మేయర్ కోనేరు శ్రీధర్.. ‘కమిషనర్’ అంటూ పలుమార్లు ఏకవచనంతో సంబోధించడం సభలో చర్చకు దారితీసింది. అనధికారిక కట్టడాలకు సంబంధించి పది శాతం ఫైన్ వసూలు విషయాన్ని టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. రెండో అంతస్తు నిర్మాణానికి సంబంధించి జీవో 168 ప్రకారం ప్రభుత్వం నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫైన్‌ను నిలుపుదల చేయాల్సిందిగా టీడీపీ ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు కోరారు. మార్కెట్ విలువ ప్రకారం కాకుండా భవన నిర్మాణ ఫీజుల ఆధారంగా ఫైన్ వసూలు చేయాల్సిందిగా సూచించారు. మేయర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలకు సంబంధించి జరిమానాలు విధించేందుకు నగరపాలక సంస్థలో జడ్జిని ఏర్పాటు చేసినప్పటికీ ఆయన్ను క్షేత్రస్థాయి పర్యటనలకు ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ తీవ్రంగా స్పందించారు. జడ్జికి రూ.5 వేలకు మించి ఫైన్ వేసే అధికారం లేదన్నారు. తనకున్న అధికారాల ప్రకారం మార్కెట్ విలువలో పది శాతం వరకు వసూలు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు ఫైన్‌ల రూపంలో కోటి రూపాయలు వసూలైందన్నారు. మీరు (కమిషనర్) ఫైన్ వేయండి. అయినంత మాత్రాన జడ్జిని తిప్పననడం సరికాదని మేయర్ పేర్కొన్నారు. పది శాతం ఫైన్‌ను తగ్గించాల్సిందిగా హరిబాబు సూచించగా కమిషనర్ కుదరదని తేల్చేశారు. సెకండ్ ఫ్లోర్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఇదే విధానాన్ని కొనసాగిస్తామని కుండబద్దలు కొట్టారు. దీంతో మేయర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పది శాతం ఫీజు వసూలు చేయమని జీవో ఎప్పుడు వచ్చిందో చెప్పాలని సిటీప్లానర్‌ను నిలదీశారు. ప్రభుత్వం జీవోలను అమలు చేసే సందర్భాల్లో కౌన్సిల్‌కు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు.

 
కమిషనర్ నిర్ణయం భేష్

వైఎస్సార్‌సీపీ సభ్యుడు చందన సురేష్ మాట్లాడుతూ నగరంలో అక్రమ కట్టడాలు పేట్రేగుతున్నాయన్నారు. కమిషనర్ నిర్ణయం వల్ల కార్పొరేషన్‌కు దండిగా ఆదాయం వస్తోందన్నారు. పేదలు నివసించే ప్రాంతంలో ఐదు శాతం, పెద్దలు నివసించే ప్రాంతంలో పది శాతం చొప్పున ఫైన్ వసూలు చేయాల్సిందిగా సూచించారు. పది శాతం ఫైన్ మినహాయించాలని టీడీపీ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ సవరణ తీర్మానం ఇచ్చింది.

 
ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలోనే ఫస్ట్...

విజయవాడ కార్పొరేషన్ 105 శాతం ఆస్తిపన్ను వసూళ్లుచేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మేయర్ చెప్పారు. అయితే కొందరు సిబ్బంది పని దొంగల్లా మారారని, వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ పన్ను వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి జీతాలు కట్ చేస్తున్నట్లు చెప్పారు. నగరంలో గోల్డెన్ మైల్ ప్రాజెక్ట్ జూన్ నాటికి అందుబాటులోకి రానున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావుతో పాటు తొలిసారిగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు