రోడ్డు ప్రమాదంలో ఎంసీఏ విద్యార్థి మృతి

21 Aug, 2013 05:05 IST|Sakshi
పిడుగురాళ్ల (గుంటూరు), న్యూస్‌లైన్ :రోడ్డు ప్రమాదంలో ఎంసీఏ విద్యార్థి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి సమీపంలోని బాలాజీసెమ్ సున్నంమిల్లువద్ద మంగళవారం జరిగింది. ఆ వివరాల ప్రకారం... త్రిపురాంతకం మండలం అన్నెసముద్రం గ్రామానికి చెందిన కోయ బాలకోటేశ్వరరావు(22) గుంటూరులోని ఓ కళాశాలలో ఎంసీఏ చదువుతున్నాడు. మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు గుంటూరు నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. స్థానిక బాలాజీసెమ్ సున్నంమిల్లు వద్ద లారీని తప్పించే ప్రయత్నంలో రాళ్లగుట్టపైకి ఎక్కి ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది. పక్కనే వెళ్తున్న లారీ చక్రాలు బాలకోటేశ్వరరావు తలపై ఎక్కడంతో తల నుజ్జునుజ్జై అక్కడికక్కడే మరణించాడు. ఎస్సైలు సాంబశివరావు, జిలానీబాషా ఘటన స్థలికి చేరుకుని మృతుని సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 
 
 ఆ కుటుంబంలో చదువుకుంది 
 అతనొక్కడే...
 అన్నెసముద్రం గ్రామానికి చెందిన కోయ రంగయ్య, అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దకుమారుడు మిర్చి కమీషన్ కొట్టు నిర్వహిస్తుండగా, మూడో కుమారుడు తండ్రితోపాటు వ్యవసాయం చేస్తుంటాడు. రెండో కుమారుడైన బాలకోటేశ్వరరావుకు చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. గుంటూరులోని ఒక ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ చదువుతున్న బాలకోటేశ్వరరావు అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. మోర్జంపాడులో వివాహానికి వస్తున్నట్టు తల్లిదండ్రులు ఫోన్‌చేసి చెప్పడంతో బాలకోటేశ్వరరావు కూడా గుంటూరు నుంచి బైక్‌పై బయలుదేరాడు. మధ్యలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. ఇంట్లో చదువుకున్న ఒక్కడూ తమను విడిచి వెళ్లిపోయాడంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
 
>
మరిన్ని వార్తలు