700 ఎంబీబీఎస్ సీట్లు హుష్‌కాకి!

18 Jun, 2015 03:36 IST|Sakshi
700 ఎంబీబీఎస్ సీట్లు హుష్‌కాకి!

తెలంగాణలో 350, ఏపీలో 350 సీట్లకు కోత
మల్లారెడ్డి రెండు కళాశాలలకూ సీట్ల నిరాకరణ
ఈఎస్‌ఐ వైద్య కళాశాలకు అనుమతి తిరస్కరణ
తొలిసారి ఏపీలో ‘గీతం’కు అటానమస్ హోదా
భారతీయ వైద్యమండలి నిర్ణయం
అటానమస్ హోదాపై ఏపీ జూడాల సంఘం ఆందోళన

సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు భారీగా కోత విధిస్తూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయం తీసుకొంది.  

మరికొద్ది రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరగనున్న నేపథ్యంలో సీట్ల కోతతో అటు యాజమాన్యాలకే కాదు కన్వీనర్ కోటా కింద అడ్మిషన్లు పొందే మెరిట్ విద్యార్థులకూ తీవ్ర నష్టం జరగనుంది. తెలంగాణలో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లకు 300 సీట్లు కోత వేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వభారతి, ఎన్‌ఆర్‌ఐ విశాఖపట్నం కళాశాలల నుంచి 300 సీట్లు కోత వేశారు. మొత్తంగా రెండు రాష్ట్రాల్లోనూ 350 సీట్ల చొప్పున 700 సీట్లకు కోత పడింది. హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్) వైద్య కళాశాలకు భారతీయ వైద్యమండలి అనుమతి తిరస్కరించింది. 200 సీట్ల ప్రతిపాదనతో ఎంసీఐకి దరఖాస్తు చేసిన ఈ కళాశాలకు సరైన వసతులు లేని కారణంగా అనుమతివ్వలేదు.
 
ఏపీలో తొలిసారి డీమ్డ్ కళాశాల
ఏపీలో తొలిసారి అటానమస్ (డీమ్డ్) కళాశాలకు అనుమతిచ్చారు. విశాఖ లోని గీతం(గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్) కళాశాలకు 150 సీట్లతో అటానమస్ హోదా ఇచ్చారు. ఈమేరకు ఎంసీఐ అనుమతించింది. అటానమస్ అనుమతికి రాష్ట్రప్రభుత్వం అంగీకరించినట్టు తెలి సింది. అటానమస్‌లో అడ్మిషన్ల నుంచి  ఫీజుల వరకూ అన్నీ యాజమాన్యమే నిర్ణయిస్తుంది. కన్వీనర్ కోటా సీట్లు ఉండవు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరిధిలోకి రాదు. గీతంకు అనుమతి వచ్చిన నేపథ్యంలో మరికొన్ని ప్రైవేటు కళాశాలలు డీమ్డ్ హోదాకు దరఖాస్తు చేయనున్నాయి. దీనివల్ల కన్వీనర్ కోటా సీట్లు కోల్పోతారు.
 
విద్యార్థులకు తీవ్రంగా నష్టం
ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో అటానమస్ సంస్కృతి లేదు. ఇప్పుడు గీతంకు ఇచ్చారు. దీనివల్ల ప్రతిభకలిగిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. ఇక రాష్ట్రంలో అన్ని ప్రైవేటు కళాశాలలు అటానమస్‌వైపు వెళతాయి. అప్పుడు కన్వీనర్ కోటా సీట్లుండవు. లక్షలు పోసి సీట్లు కొనుక్కోవాల్సి వస్తుంది. వైద్యవిద్యకు భారీగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జూనియర్ వైద్యులందరం దీనిపై ఆందోళన చేస్తాం.
 -డా.పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, ఏపీ జూనియర్ వైద్యుల సంఘం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా