జీడిపప్పు పరిశ్రమలో యాంత్రీకరణ

12 May, 2014 02:14 IST|Sakshi

వేటపాలెం,న్యూస్‌లైన్ : జీడిపప్పు పరిశ్రమల్లో కూలీల కొరతను అధిగమించేందుకు వ్యాపారులు యంత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. జీడిపప్పు పరిశ్రమకు రాష్ట్రంలోనే పేరుగాంచిన ప్రదేశం వేటపాలెం. అయితే ఈ పరిశ్రమను ప్రస్తుతం కూలీల కొరత పట్టిపీడిస్తోంది. జీడిపప్పు పరిశ్రమలో పనిచేయడానికి వేటపాలెం చుట్టు పక్కల గ్రామాల మహిళలు వచ్చి వెళ్తుంటారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో చాలా మంది కూలీలు జీడిపప్పు పరిశ్రమల్లో పనిచేయడానికి  ఆసక్తి చూపడం లేదు.

కూలీలు వ్యవసాయ పనులకు వెళ్తుండటంతో జీడిపప్పు వ్యాపారులు యంత్రాలను ఉపయోగించడం ప్రారంభించారు. వేటపాలెంలో దాదాపు 20 జీడిపప్పు పరిశ్రమలున్నాయి. వీటిలో ఐదు వేల మంది కూలీలు పనిచేస్తున్నారు. వేటపాలెం ప్రాంతంలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యాపారులు తమ పరిశ్రమల్లో యంత్రాలను ప్రవేశపెట్టారు. మిగిలిన వ్యాపారులు కూడా యంత్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

 జీడిపప్పు పరిశ్రమలో యంత్రాలు పనిచేసేది ఇలా..
 జీడిపప్పు ఫ్యాక్టరీల్లో జీడి గింజలను కాల్చిన తర్వాత  కార్మికులతో జీడిపప్పును వేరుచేయిస్తారు. అనంతరం జీడిపప్పు పైన ఉండే పలుచటి పొరను తొలగింపజేస్తారు. అలా వచ్చిన జీడిపప్పు నాణ్యతను బట్టి గ్రేడ్‌లుగా విభజించి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇదంతా పాత విధానం. ప్రస్తుతం కూలీల స్థానంలో యంత్రాలొచ్చాయి. కాలుష్యం పెరుగుతోందనే కారణంతో జీడి గింజలు కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించింది. కొత్త పరిశ్రమలకు లెసైన్సులు కూడా నిలిపేసింది. దీంతో వ్యాపారులు యంత్రాలు ఉపయోగించి బాయిల్డ్ పద్ధతి ద్వారా జీడి గింజల నుంచి పప్పును వేరు చేయడం ప్రారంభించారు.

 పరిశ్రమలో జీడి గింజలను ఉడక బెట్టిన తర్వాత వాటిని కత్తిరించి పప్పును వేరు చేసి యంత్రాల వద్దకు చేరుస్తారు. అక్కడ ఉన్న హాట్ బాక్సుల్లో పప్పును వేడి చేసి యంత్రాల్లో వేస్తారు. పప్పు పైన ఉన్న పల్చటి పొరను యంత్రాలు తొలగించడమే కాకుండా నాణ్యతను బట్టి గ్రేడ్‌లుగా విభజిస్తాయి. ‘యంత్రాల ద్వారా త్వరగా పనిజరుగుతోంది. ఒక్కో కూలీ రోజుకు పది కిలోల జీడిపప్పు గ్రేడింగ్ చేస్తారు. అదే యంత్రంతో అయితే గంట వ్యవధిలో 50 కిలోల జీడిపప్పు గ్రేడ్ చేస్తున్నాం. వంద మంది కూలీలు చేసే పని కేవలం ఒక యంత్రంతో పూర్తవుతోంది. కూలీల కొరత తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంద’ని వ్యాపారులు పేర్కొంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు