విహారం మిగిల్చిన విషాదం

8 Aug, 2013 02:23 IST|Sakshi

 సంగారెడ్డి మున్సిపాలిటీ/సంగారెడ్డి రూరల్/పటాన్‌చెరు టౌన్, న్యూస్‌లైన్ : స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో విహారయాత్రకు బయలుదేరిన ఐదుగురు మిత్రులను మృత్యువు వెంటాడింది. విహారయాత్ర ముగించుకుని తిరుగుపయనమైన వారు గమ్యం చేరుకముందే  తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిలింది. మృతుల్లో ఒకరైన శశిభూషణ్ తన పుట్టిన రోజుకు ఒకరోజు ముందే మృతి చెందటం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలచివేసింది. జిల్లా వాసులను కలచి వేసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ సమీపంలో షాంగ్లా గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన రాబిన్ స్వరాజ్(38), శ్రీకాంత్(26), ప్రదీప్‌కుమార్(25), శశిభూషణ్(26), ప్రణీత్‌రెడ్డి(25) మృతి చెందారు. వీరంతా మిత్రులు కాగా, గత శనివారం ఫ్రెండ్‌షిప్‌డే వేడుకలు గోవాలో సరదాగా జరుపుకోవాలని సంగారెడ్డి నుంచి ఇండికా వాహనంలో బయలుదేరి వెళ్లారు. గోవా విహారయాత్ర ముగించుకుని మంగళవారం రాత్రి సంగారెడ్డి తిరుగుపయనమయ్యారు.
 
 అయితే బీజాపూర్ సమీపంలో షాంగ్లా వద్ద 218 జాతీయ రహదారిపై  రాత్రి 7.30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న ఇండికా వాహనం బండరాళ్లలోడ్‌తో ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మిత్రులు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం పూర్తిగా ధ్వంసం కాగా మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. బీజాపూర్ సమీపంలోని కొల్లార్ పోలీసులు ఘటన స్థలం చేరుకుని మృతదేహాలను బీజాపూర్‌లోని అల్-ఇమామ్ ఆసుపత్రికి తరలించారు. ఇండికా వాహనంపై ఉన్న వాహనం సర్వీసింగ్ సెంటర్ స్టిక్కర్ ఆధారంగా కొల్లార్ స్టేషన్ పోలీసులు మృతుల వివరాలను ఆరా తీసి వారి కుటుంబీకులకు రాత్రి 11.30గంటల ప్రాంతంలో సమాచారం అందజేశారు. బుధవారం ఉదయం హుటాహుటీన బీజాపూర్ వెళ్లిన మృతుల కుటుంబీకులు అక్కడి అల్-ఇమామ్ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఆ తర్వాత వాహనాల్లో ఐదు మృతదేహాలను తీసుకుని రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సంగారెడ్డికి చేరుకున్నారు. ఆ వెంటనే రాబిన్‌స్వరాజ్, ప్రదీప్‌కుమార్, శశిభూషణ్, ప్రణీత్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, శ్రీకాంత్ అంత్యక్రియలు మాత్రం గురువారం చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
 
 వేడుక చేసుకునేందుకు వెళ్లి...
 సంగారెడ్డికి చెందిన రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి కళాశాల స్థాయి నుంచి మిత్రులు. వీరికి మరో ఆరుగురు మిత్రులు సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఉన్నారు. మొత్తం 11 మంది మిత్రులు గతనెల 31న సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో కలుసుకున్నారు. ఆగస్టు 4వ తేదీన ఫ్రెండ్‌షిప్‌డే ఉన్నందున గోవా విహారయాత్రకు వెళ్ళాలని, అక్కడే సరదాగా ఫ్రెండ్‌షిప్ డే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరిలో ఆరుగురు మిత్రులు తమకు వీలుకాదని చెప్పటంతో రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి షిర్డీ మీదుగా గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత శనివారం రాబిన్ స్వరాజ్ మామయ్యకు చెందిన ఇండికా విస్టా కారులో ఐదుగురు మిత్రులూ సంతోషంగా గోవా బయలుదేరి వెళ్లారు. గోవా విహారయాత్ర ముగించుకుని సంగారెడ్డికి తిరిగి వస్తుండగా బీజాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
 
 బర్త్‌డేకు ఒకరోజు ముందే...
 బర్త్‌డేకు కేవలం ఒక్కరోజు ముందే శశిభూషణ్ మృత్యువాత పడడం వారి కుటుంబసభ్యులను, మిత్రులను, బంధువులను తీవ్రంగా కలచివేస్తోంది. సంగారెడ్డి మండలం కవలంపేట గ్రామానికి చెందిన శశిభూషణ్ పుట్టినరోజు గురువారం(8వ తేదీ) కావడంతో ఆ రోజు కుటుంబసభ్యులతో గడపాలనుకున్నాడు. అందుకే బుధవారం నాటికే స్వగ్రామం చేరాలని గోవా నుంచి బయలుదేరాడు. అయితే పుట్టినరోజు వేడుకలు జరుపుకోకముందే శశిభూషణ్ మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది. తమబిడ్డ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాల్సిన తాము అతని అంతిమయాత్రలో పాల్గొనాల్సి వచ్చిందని శిశిభూషణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే శిశిభూషణ్ మరణవార్త చివరి వరకూ ఆయన తల్లి శ్యామమ్మకు కుటుంబీకులు తెలియనివ్వలేదు. ఒక్కసారిగా కనిపించిన కుమారుడు మృతదేహాన్ని చూసి ఆ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడిపెట్టించింది.
 
 కుటుంబాల్లో అంతులేని విషాదం
 సంగారెడ్డికి చెందిన రాబిన్ స్వరాజ్, శ్రీకాంత్, ప్రదీప్‌కుమార్, శశిభూషన్, రుద్రారంకు చెందిన ప్రణీత్‌రెడ్డి మృతితో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది. మంగళవారం రాత్రి వారి మృతి వార్త విన్నవెంటనే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వారి ఇళ్లవద్ద విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబాలను వారి బంధువులు, మిత్రులు పరామర్శించారు. మృతుల స్నేహితులంతా వారి ఇళ్లవద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఐదుగురు మిత్రుల మృతితో సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, రుద్రారం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
 మృతుల నేపథ్యమిది....
 రాబిన్‌స్వరాజ్:  సంగారెడ్డి పట్టణంలోని మార్క్స్‌నగర్‌కు చెందిన పభుత్వ ఆస్పత్రి విశ్రాంత ఉద్యోగి శాంతకుమార్ పెద్దకుమారుడు. ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న రాబిన్‌స్వరాజ్ సంగారెడ్డి ఐటీఐ ఎదురుగా శ్వాస క్లినిక్‌ను 8 నెలలుగా  నడుపుతున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. తన మిత్రులతో కలిసి గత శనివారం తన మామయ్య వాహనంలో మిత్రులతో కలిసి రాబిన్‌స్వరాజ్ గోవా బయలుదేరి వెళ్లాడు.  కె.శ్రీకాంత్: సంగారెడ్డి పట్టణంలోని సోమేశ్వరవాడలో నివాసం ఉంటున్న కె.శ్రీకాంత్ స్థానిక యాక్సిస్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్నాడు. తండ్రి వెంకటేశ్వర్‌రావు 25 ఏళ్ల క్రితం నెల్లూరు నుంచి సంగారెడ్డికి వచ్చి ఇటుక వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డాడు. వెంకటేశ్వర్‌రావుకు ఇద్దరు కుమారులు కాగా వారిలో మృతుడు శ్రీకాంత్ చిన్నవాడు. సంగారెడ్డిలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీకాంత్ ఇక్కడే యాక్సిస్ బ్యాంకులో రెండేళ్లుగా పనిచేస్తూ సహచరులతో కలుపుగోలుగా ఉండేవాడు. ఇటీవలే శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది.
 
 ప్రదీప్‌కుమార్: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రదీప్‌కుమార్ సంగారెడ్డిలోని విద్యాభ్యాసం పూర్తి చేశాడు. హెచ్‌ఎండీఏ విశ్రాంత ఉద్యోగి అంజయ్య, శాంతమ్మ దంపతులకు ప్రదీప్‌కుమార్ ఏకైక కుమారుడు. హైదరాబాద్‌లో కంప్యూటర్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న ప్రదీప్‌కుమార్ మృతితో వారి కుటుంబం వారసున్ని కోల్పోయింది. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు తోబుట్టువులు ప్రదీప్ మరణవార్త విని హతాశులయ్యారు.
 
 ప్రణీత్‌రెడ్డి:  పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన ప్రణీత్‌రెడ్డి ఇటీవలే ఎంసీఏ పూర్తి చేసి, హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ప్రాజెక్టు చేస్తున్నాడు.
 

>
మరిన్ని వార్తలు