మహా సంబురం

8 Feb, 2014 23:59 IST|Sakshi
మహా సంబురం

 వనమెల్లా జనం..నిలువెల్లా బంగారం  గిరి‘జన’జాతరకు వందనం
 సల్లంగ సూడు తల్లీ..
 
 మేడారం....
 గిరిజన సంప్ర దాయానికి నిలువెత్తు ప్రతిరూపం. ఆ అడవి ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. రాజరికపు పాలనపై దండెత్తిన చారిత్రక నేపథ్యం. పన్నులు కట్టబోమని తెగేసి చెప్పిన ధీరత్వం ఆ నేల సొంతం. కాకతీయుల పాలనపై కత్తిదూసిన సమ్మక్క, సారలమ్మలు అడవి బిడ్డల ఆరాధ్య దైవాలు. రెండేళ్ల కోసారి ఈ ఇలవేల్పులను కొలిచే జాతరే మేడారం ప్రత్యేకం. అరవై గుడిసెల సమాహారం ఆ నాలుగురోజుల్లో మహానగరమవుతుంది. కోటి అడుగుల చప్పుడవుతుంది. కోయగూడెం ఎర్రరేగడి మట్టితో సింగారించుకుంటుంది. ఒక్కో రోజు ఒక్కో సన్నివేశానికి సంతకమవుతుంది. ఊరేగింపుగా వచ్చే  జనంతో అక్కడ ఓ ఉద్వేగం. ఆరాధ్య దైవాలను మొక్కుకునే తీరు ఓ మహా సన్నివేశం. సబ్బండ వర్ణాలు ఒక్కచోట చేరే క్షణం అనిర్వచనీయం. కనిపించని దైవాల కోసం కదిలివచ్చే జనంతో జంపన్న వాగు జనసంద్రమవుతుంది.
 
  అమ్మల కోసం ఊరూ వాడా కదిలొస్తుంది. చిలకల గుట్టవైపు పరుగులు తీసే జనంతో కిక్కిరిసి పోతుంది. శివ్వాలెత్తే శివసత్తుల పూనకాలతో చెట్టూ పుట్టా ఊగిపోతాయి. అడవిని ముద్దాడుతూ లక్షలాది అడుగులు వెంట నడుస్తాయి. సామూహికత సాక్షాత్కరిస్తుంది. దుబ్బ కొట్లాడుతుంది... సంప్రదాయం తిరుగాడుతుంది. నెత్తుటి జ్ఞాపకాలు కళ్లెదుటే కనబడుతాయి... పురా ఆత్మలు సంభాషిస్తాయి. నెమలినార చెట్టు నేనున్నానంటూ పలకరిస్తుంది. కొంగు బంగారం కొలువుదీరుతుంది. కుంకుమ భరిణె ఇంటింటి చుట్టమై వస్తుంది. దండ కారణ్యం దండం పెడుతుంది. పసుపు వర్ణ శోభితమై పీతాంబ రమవుతుంది. బెల్లం నైవేద్యమ వుతుంది. అమ్మల రాక చీకటిని చీల్చుకుంటూ వెలుగులు విరజిమ్ముతుంది. భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. జయజయ ధ్వానాలు మార్మోగుతాయి. సల్లంగా  సూడు తల్లీ అంటూ  శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతాయి.
 
 - మేడారం నుంచి పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్
 
 మొదటి రోజు  సారలమ్మ ఆగమనం...
 కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. సమ్మక్క కూతురైన సారమ్మ నివాసం కన్నెపల్లి. సారలమ్మ ఫిబ్రవరి 12న బుధవారం సాయంత్రం  గద్దె వద్దకు చేరుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే కన్నెపల్లి నుంచి సారలమ్మ వడ్డెలు(పూజారులు) మేడారంలోని గద్దెల వద్దకు వచ్చి, ముగ్గులు వేసి మళ్లీ కన్నెపల్లిలోని పూజా మందిరానికి వెళ్తారు. అక్కడ రెండుగంటలపాటు గోప్యంగా పూజలు నిర్వహిస్తారు. కడుపు పండాలని కోరుకునేవారు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వేలమంది భక్తులు తడి బట్టలతో గుడి ఎదుట సాష్టాంగ ప్రణామాలతో వరం పడతారు. దేవత రూపాన్ని చేతపట్టుకుని గుడి బయటకు వచ్చిన పూజారులు వరం పడుతున్న వారి పైనుంచి నడిచి వెళతారు. ఆ సారలమ్మే తమపై నుంచి వెళుతుందని భక్తుల నమ్మకం. అమ్మవారిని తీసుకొస్తున్న వడ్డెను దేవదూతగా భావిస్తారు. గ్రామ మహిళలు మంగళహారతులు ఇచ్చి, నీళ్లారబోసి కొబ్బరికాయలు కొడుతూ మేడారానికి సారలమ్మను సాగనంపుతారు. అక్కడినుంచి సారలమ్మ జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు చేరుకుంటారు.  అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. సారలమ్మ సహా వీరి ముగ్గురికి అక్కడ వడ్డెలు ప్రతిష్టిస్తారు.
 
 రెండో రోజు   సమ్మక్క ఆగమనం...
 జాతరలో  రెండో రోజైన గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది.  ఉదయం ఆరు గంటల నుంచే కార్యక్రమం మొదలవుతుంది. మొదట వడ్డెలు చిలకలగుట్టకు వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేస్తారు.  సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు(పసిడి కుండలు)ను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. మళ్లీ చిలకలగుట్టకు వెళతారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమ్మక్కను గద్దెలపైకి తీసుకు వచ్చే ప్రక్రియ మొదలవుతుంది. చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధాన ఘట్టం ఇదే. సమ్మక్క ఆగమనం కోసం లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లికి ఆహ్వానం పలుకుతూ చిలకలగుట్ట వద్దకు వెళతారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె తన్మయత్వంతో ఒక్క ఉదుటున పరుగులు తీస్తాడు.  వందల మంది పోలీసులు అతడికి రక్షణగా ఉంటారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్చి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్కకు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు. ప్రత్యేక పూజల అనంతరం కుంకుమ భరిణెను గద్దెలపైకి చేర్చుతారు.  
 
 మూడో రోజు   గద్దెలపై తల్లులు...
 గద్దెలపై ఆసీనులైన సమ్మక్క-సారలమ్మలు మూడోరోజు శుక్రవారం అశేష భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. కోర్కెలు తీరినవారు కానుకలు చెల్లిస్తారు. నిలువుదోపిడీ ఇస్తారు. వన దేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపుకుంకుమలు, చీరెసారెలు పెడతారు. ఒడి బియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం(బెల్లం) నైవేద్యంగా పెడతారు. కట్టలు తెంచుకున్న భక్తితో ఉరకలెత్తుతున్న జనంతో మేడారం పరిసరాలు సందడిగా మారుతాయి. ఈ రోజంతా లక్షలాది మంది గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటారు. వీరితో గద్దెల ప్రాంగణాలు జనసంద్రమవుతాయి. జాతరలో మేడారానికి ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు.
 
 నాలుగో రోజు  దేవతల వన ప్రవేశం...
 నాలుగో రోజు సమ్మక్కను చిలకల గుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. మొక్కులు తీర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచ్చిన సమ్మక్క-సారలమ్మలు నాలుగో రోజు శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేస్తారు. దేవతలను గద్దెలపైకి చేర్చేక్రమంలో రక్షణ కల్పించిన విధంగానే పోలీసులు వన ప్రవేశం సమయంలోనూ కట్టుదిట్టమైన రక్షణతో వనాలకు సాగనంపుతారు. సమ్మక్కతల్లి చిలకలగుట్టపైకి, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లిన అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగు పయనమవుతారు.
 
 దైవాన్ని తెచ్చే చేతులు
 
 ..ఆ  ఇద్దరు వీరే!
 
 నిష్ఠతో ఒక్కపొద్దు ఉంట...
 గుడిమెలిగె పండుగతో సమ్మక్క-సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. జాతర మొదలయ్యేది మండెమెలిగె  పండుగతోనే. ఈ పండుగ రోజు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లిని గద్దెలపైకి చేర్చే వరకు నియమనిష్ఠలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపళ్లు  తీసుకుంటాం. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటాం. సమ్మక్క, సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహ అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. మండెమెలిగె పండుగ నాటి నుంచే నిష్ఠతో ఒక్క పొద్దు ఉంటా ను. ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని తల్లి చేసిపెడుతుంది.
 - కొక్కెర కృష్ణయ్య, సమ్మక్క ప్రధాన వడ్డె
 
 ఏం జరుగుతుందో తెలియదు...
 సారలమ్మను గద్దెకు తీసుకురావడానికి రెండు రోజుల ముందు నుంచే అదోలా ఉంటుంది. సరిగ్గా వారం రోజుల ముందు.. మండమెలిగె పండుగ నుంచి సారలమ్మ పూనినట్లుగా అనిపిస్తుంటుంది.  సారలమ్మను తీసుకెళ్లేరోజు ప్రత్యేక పూజలు చేస్తున్న సమయంలోనే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. సమ్మక్క ఆలయంలో సారలమ్మను చేర్చి పూజలు చేస్తున్న సమయంలో కొంత తెలివి వస్తుంది. మళ్లీ అక్కడి నుంచి గద్దెపైకి చేర్చే సమయానికి తన్మయత్వంలో ఉంటాను. గద్దెలపై ప్రతిష్టించిన తర్వాత నెమ్మదినెమ్మదిగా మైకం వీడుతుంది.   
 - కాక సారయ్య, సారలమ్మ ప్రధాన వడ్డె
 

మరిన్ని వార్తలు