పగిడిద్దరాజు పెళ్లికొడుకాయెనె..

12 Feb, 2014 02:49 IST|Sakshi

 సమ్మక్కను మనువాడేందుకు పయనం..
     సంప్రదాయబద్ధంగా గుడిలో
     గిరిజనుల పూజలు
     పడిగెతో కాలినడకన మేడారానికి..
 
 పూనుగొండ్ల(కొత్తగూడ), న్యూస్‌లైన్ :
 పగిడిద్దరాజు పెళ్లి కుమారుడిగా ముస్తాబయ్యాడు. గిరిజనుల ఆరాధ్యదైవం సమ్మక్కను పరిణయమాడేందుకు కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి మంగళవారం బయలుదేరాడు. సంప్రదాయ డోలి వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, భక్తుల మొక్కుల మధ్య పగిడిద్దరాజును కాలినడకన పూజారులు తీసుకెళ్లారు. తొలుత తలపతి పెక్క చిన్నబక్కయ్య ఇంట్లో పెళ్లి కుమారుడిగా పగిడిద్దరాజును ముస్తాబు చేసేందుకు పానుపు(నూతన వస్త్రాలు, నవధాన్యాలు, పసుపు, కుంకుమ)ను భక్తిశ్రద్ధలతో సిద్ధం చేసి గుడికి తరలించారు. గుడిలో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేసి పడిగెను సిద్ధం చేశారు. కుండలో భద్రపరిచిన మువ్వలను ధరించిన పూజారులు ముందు నడుస్తుండగా వాటి సవ్వడికి శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. పగిడిద్దరాజు పడిగెను తీసుకెళ్తున్న పూజారుల కాళ్లు కడిగి పడిగెను తాకేందుకు మహిళలు పోటీపడ్డారు. అందరూ భక్తిపారవశ్యంతో పగిడిద్దరాజును మేడారం తరలించారు.
 
 లక్ష్మీపురంలో బస..
 పగిడిద్దరాజు మంగళవారం రాత్రి కర్లపెల్లి మీదుగా లక్ష్మీపురం చేరుకుంటాడు. పెనక వంశీయుల ఇంట్లో బస చేసి అక్కడి ప్రజలకు దర్శనమిస్తాడు. బుధవారం తెల్లవారుజామున బయలుదేరి సాయంత్రం వరకు మేడారం చేరుకుంటాడు. దీంతో సమ్మక్క వద్దకు పగిడిద్దరాజు, గోవిందరాజులు వచ్చి కలుస్తారు. ముగ్గురు పూజారులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పోలీసు బందోబస్తు నడుమ దేవతలు వారివారి గద్దెలపైకి చేరి భక్తులకు దర్శనమిస్తారు.
 
 

>
మరిన్ని వార్తలు