మేడ్చల్ పీఏసీఎస్‌లో చోరీకి యత్నం

16 Aug, 2013 03:22 IST|Sakshi


 మేడ్చల్ న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించి రికార్డులను చిందరవందరగా పడేశారు. పీఏసీఎస్ సిబ్బంది కథనం ప్రకారం.. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో కార్యదర్శి మోహన్‌రావు, అటెండర్ ప్రకాష్‌లు బుధవారం సాయంత్రం వరకు ఏర్పాట్లు చేశారు. మోహన్‌రావు 5 గంటలకు వెళ్లిపోగా అటెండర్ కార్యాలయాన్ని శుభ్రం చేసి సాయంత్రం ఏడు గంటల తర్వాత కార్యాలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు.
 
  మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న పీఏసీఎస్ కార్యాలయంలోకి బుధవారం రాత్రి దుండగులు ప్రహరీ దూకి ప్రవేశించారు. గది తాళాలు పగులగొట్టి లోపలకి చొరబడ్డారు. కార్యదర్శి, చైర్మన్ గదుల తాళాలు పగులగొట్టి రికార్డులను చిందరవందర చేశారు. ఫైళ్లను భద్రపరిచే బీరువాలను ధ్వసం చేశారు. చైర్మన్ అంతిరెడ్డి చాంబర్‌లోని టేబుల్ డ్రాతో పాటు కార్యదర్శి టేబుళ్లను పడేశారు. ఫైళ్లను ఛిన్నాభిన్నం చేశారు. పాత రికార్డులను ఉంచే మూటలను విప్పి అందులో రికార్డులను గదుల్లో పడేశారు. కంప్యూటర్‌ను ధ్వంసంచేసే యత్నం చేశారు. గురువారం కార్యాలయ సిబ్బంది సమాచారంతో సీఐ రాంరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని 2 లీటర్ల పెట్రోల్ సీసా, అగ్గిపెట్టె, ఓ తాపీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. కార్యాలయం నుంచి ఎలాంటి ఫైళ్లు, సామగ్రి చోరీ కాలేదని పీఏసీఎస్ కార్యదర్శి మోహన్‌రావు తెలిపారు.
 
 అంతా అనుమానాస్పదం..
 డబ్బులు, విలువైన వస్తువులు ఉండని పీఏసీఎస్‌లో చోరీయత్నం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మేడ్చల్ పీఏసీఎస్ దాదాపు కోటి రూపాయల టర్నోవర్‌తో నడుస్తోంది. కాగా సంఘానికి అనుబంధంగా బ్యాంకు ఉంది. రుణాల రికార్డులను మాయం చేసేందుకు దుండగులు ఘటనకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. చోరీ యత్నంలో ‘ఇంటి దొంగల’ హస్తం ఏమైనా ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంరెడ్డి తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు