సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా అగచాట్లు

14 Aug, 2015 00:42 IST|Sakshi

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలనను నగరం నుంచి ప్రారంభించినా ఇక్కడ సమాచార వ్యవస్థ సరిగాలేదు. దాంతో మీడియా ప్రతినిధులు నానా అవస్తలు పడవలసి వస్తోంది. మూడురోజుల నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంలో వరుస సమీక్షలు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నా ఆ సమాచారం ఇక్కడి అధికారులకు,  మీడియాకు తెలియజేయడంలో  తీవ్ర జాప్యం జరుగుతోంది.  బుధవారం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ఎడతెరిపిలేకుండా సమీక్షలు నిర్వహించారు. ఆ సమాచారం రాత్రి పొద్దుపోయేవరకు మీడియాకు  విడుదల కాలేదు. ఆరాతీస్తే సీఎం క్యాంపు కార్యాలయం వద్ద   సమాచార పౌర సంబంధాల శాఖను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలిసింది.
 
  రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్  కలిసి సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి, మార్పులు చేర్పులు చేసి హైదరాబాద్‌లో సీఎం పేషీకి పంపుతున్నారు. అక్కడ  నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన తరువాత  ఇక్కడ విడుదల చేస్తున్నారు. దాంతో పగటి పూట జరిగిన కార్యాక్రమాల వివరాలు కూడా మీడియాకు అందటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక్కడ క్యాంపు కార్యాలయం వద్ద నియమితులైన ఐ అండ్ పీఆర్ అధికారులను కూడా సీఎం చాంబర్‌లోకి అనుమతించటం లేదు. దాంతో లోపల జరుగుతున్న చర్చలు, సమావేశాల సారాంశం మీడియాకు ఎప్పటికప్పుడు అందటం లేదు.   మీడియా ప్రతినిధులు సమాచారం కోసం గంటల తరబడి  వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
 
 తాత్కాలిక మీడియా పాయింట్ ఏర్పాటుకు ఆదేశాలు
 కాగా విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద అత్యవసరంగా తాత్కాలిక మీడియాపాయింట్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. క్యాంపు కార్యాలయం సమీపంలో తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేయటానికి గురువారం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం మీడియా ప్రతినిధులు షామియానాల కింద కూర్చుని, వర్షానికి తడుస్తూ సమాచారం కోసం వేచి ఉంటున్నారు.  వారి కోసం తాత్కాలికంగా ఫైబర్ లేదా ప్లాస్టిక్‌తో వసతి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు