వైద్య,ఆరోగ్య సేవలు అన్ని గ్రామాలకు చేరాలి

21 Jun, 2014 01:01 IST|Sakshi
  •     నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు
  •      అన్ని గ్రామాలలోను  ప్రత్యేక వైద్యశిబిరాలు
  •      ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్
  • పాడేరు: ఏజన్సీలోని ఎపిడమిక్ సీజన్‌ను సమర్ధంగా ఎదుర్కోవాలని, గిరిజనులకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ హెచ్చరించారు. ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల తీవ్రతపై శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారులు, ఎస్పీహెచ్‌ఓలు, వైద్యఅధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రత్యేకాధికారులంతా ఎపిడమిక్ సీజన్ ముగిసేంత వరకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలను అనుక్షణం సమీక్షించాలని ఈ సందర్భంగా పీవో ఆదేశించారు.

    మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు, క్షయవ్యాధి నివారణకు చేపడుతున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలన్నీ అన్ని గ్రామాలకు చేరాలని సూచించారు. ఎక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వైద్యాధికారి, ఇతర సిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలన్నారు.  అన్ని గ్రామాల్లోను దోమల నివారణ మందును స్ప్రేయింగ్ చేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ఆశ కార్యకర్తల వద్ద పూర్తిస్థాయిలో మందుల నిల్వలు ఉండాలని, ఎస్పీహెచ్‌ఓలు కూడా ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వైద్యసిబ్బంది పనితీరును సమీక్షించాలని ఆదేశించారు.

    ఎక్కడ అనారోగ్య సమస్యలతో గిరిజనులు మృతి చెందినా సంబంధిత వైద్యసిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. మరణాలకు సంబంధించి రోజువారీ నివేదికను తమకు అందజేయాలన్నారు. ప్రతి పంచాయతీకి రూ. 4 లక్షల మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయని తద్వారా పారిశుధ్యం, తాగునీటి వనరుల క్లోరినేషన్ పనులు చేపట్టాలన్నారు.

    సమావేశంలో పాడేరు ఆర్డీఓ రాజకుమారి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికాార్జునరెడ్డి, ఈఈ ఎంఆర్జీ నాయుడు, పీహెచ్‌ఓ చిట్టిబాబు, పీఏఓ భాగ్యలక్ష్మి, డీఎంఓ ప్రసాదరావు, ఇన్‌చార్జి ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ లీలాప్రసాద్, అన్ని క్లష్టర్‌ల ఎస్పీహెచ్‌ఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు