ఎంపీ బుట్టా రేణుక ఇల్లు ముట్టడి 

7 Jul, 2018 06:55 IST|Sakshi
ఎంపీ బుట్టా రేణుక ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

కర్నూలు(అర్బన్‌): ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్లకు తెలుగుదేశం ప్రభుత్వం తూట్లు పొడిచిందని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.  శుక్రవారం బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇంటిని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వీ భరత్‌కుమార్, బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ శేషఫణి, పీడీఎస్‌యు నాయకుడు భాస్కర్‌ మాట్లాడుతూ. ఎన్‌టీఆర్‌ వైద్య విశ్వ విద్యాలయం అధికారులు జీఓనెం.550ని అమలు చేయకపోవడంతో 496 మంది బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థులు ఎంబీబీఎస్‌ సీట్లు కోల్పోయారన్నారు. ఈ జాబితాలో అనర్హులైన అగ్రవర్ణాలకు సీట్లు కేటాయించారని, ఈ ప్రవేశాలకు సంబంధించి రూ.500 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు.

ఓపెన్‌ కేటగిరీలో మెరిట్‌ విద్యార్థులను తీసుకోవాలని కనీస పరిజ్ఞానం కూడా అధికారులకు లేకపోవడం దారుణమన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నా, ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు కనీసం మాట్లాడక పోవడం దురదృష్టకరమన్నారు. జీఓ నెం.550 ప్రకారం రీ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ బుట్టా రేణుక విద్యార్థి సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు నాని, రంగస్వామి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.
  

మరిన్ని వార్తలు