మూలనపడ్డ వైద్య పరికరాలు

6 Nov, 2019 05:01 IST|Sakshi

పెద్దాసుపత్రుల్లో పనిచేయని వందలాది పనిముట్లు 

టీడీపీ హయాంలో చేతులెత్తేసిన నిర్వహణ సంస్థ 

ఆ సంస్థపై అనేక అవినీతి ఆరోపణలు 

విజయవాడ ఆస్పత్రిలోనే పనిచేయని 251 పరికరాలు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో వైద్య పరికరాలు చాలా కాలంగా పనిచేయడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌రే పరికరాలు, అనస్థీషియా వైద్య పరికరాలు, మైక్రోస్కోప్‌లు, ఆపరేషన్‌ థియేటర్‌లలో పనిచేయాల్సినవి, పల్సాక్సీ మీటర్లు...ఇలా చాలా పరికరాలు మరమ్మతులకు నోచుకోక మూలన పడ్డాయి.

నిధులు స్వాహా మరమ్మతులు హుష్‌కాకి 
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరమ్మతుల నిర్వహణ కాంట్రాక్టు తీసుకున్న టీబీఎస్‌ అనే సంస్థ మరమ్మతులు చేయకుండా చేతులెత్తేసింది. అయినా కోట్లాది రూపాయలు ఆ సంస్థకు అప్పటి ప్రభుత్వం కట్టబెట్టడంపై కోర్టులో వ్యాజ్యమూ నడిచింది. ఏసీబీ అధికారులు సైతం ఈ సంస్థ పనితీరు, నిధుల మళ్లింపులో అవినీతి జరిగిందని నిర్ధారించారు. రకరకాల వ్యాజ్యాలు, వివాదాలు, అవినీతి ఆరోపణలు, లోపభూయిష్ట నిర్వహణ కారణంగా టీబీఎస్‌ సంస్థను తప్పించారు. ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాలంలో వందల పరికరాలు పనిచేయ లేదు.

ఎన్నిసార్లు ఫోన్‌లు చేసినా ఆ సంస్థకు చెందిన బయోమెడికల్‌ ఇంజనీర్లు స్పందించ లేదు. దీనిపై పలు బోధనాసుపత్రుల సూపరింటెండెంట్‌లు లేఖలు రాసినా ఉన్నతాధికారులు గానీ, నిర్వహణా సంస్థ గానీ పట్టించుకోలేదు.  గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరికరాల మరమ్మతులు చేసేందుకు ఒక్క బయో మెడికల్‌ ఇంజనీర్‌ను కూడా నియమించలేదు. ఇలా రకరకాల కారణాలతో పెద్దాసుపత్రుల్లోని ప్రధాన వైద్యపరికరాలు మొరాయిస్తున్నాయి. నిత్యం వేలాది మంది రోగులు వచ్చే విజయవాడ పెద్దాసుపత్రిలోనే 251 పరికరాలు మూలనపడి ఉన్నాయంటే పరిస్థితి అంచనా వేయచ్చు. 

ఆస్పత్రులకే నేరుగా నిధులు ఇస్తున్నాం.. 
సమస్యను గుర్తించాం. నేరుగా ఆస్పత్రులకే నిధులు కేటాయిస్తున్నాం. ఇకనుంచి వారే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించుకోవచ్చు. ఎవరి అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు.  
–కె. వెంకటేష్, వైద్య విద్యా సంచాలకులు  

మరిన్ని వార్తలు