6 వైద్య బృందాలు పనిచేస్తున్నాయి: డాక్టర్‌ సుధాకర్‌

13 May, 2020 11:36 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఎల్‌జీ గ్యాస్‌ లీకేజీ బాధిత గ్రామాల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వెంకటాపురంలో 10 పడకలతో వైఎస్సార్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్య నిపుణుల కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు బాధిత గ్రామాలలో 24 గంటలలో పాటు 3 షిఫ్టులలో 6 వైద్య బృందాలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ బృందం ప్రజల ఆరోగ్య సమస్యలపై దీర్ఘకాలికంగా పర్యవేక్షించడానికి 10 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించామన్నారు. ఈ వైద్య నిపుణుల కమిటీ గ్యాస్‌ లీకేజీ బాధిత గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను పరీక్షించడంలో దీర్ఘకాలికంగా పనిచేస్తుందని చెప్పారు. (బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు)

ఇందులో న్యూరో, పల్మనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కంటి, జనరల్‌ మెడిసిన్‌, పాథాలజీ, చిన్న పిల్లల వైద్య నిపుణులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ కమిటీకి తాను చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యలపై ఈ కమిటీ అధ్వర్యంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై శాస్త్రీయమైన పద్దతిలో అధ్యయనం చేయడమే కాకుండా నిరంతరాయంగా పర్యవేక్షణ చేయనున్నామన్నారు. ఇక బాధిత గ్రామాల ప్రజల ఆరోగ్య సమస్యల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వారి ఆరోగ్యంపై ఇబ్బందులు రాకుండా ఈ నిపుణుల కమిటీ పనిచేస్తుందన్నారు. స్టెరైనా గ్యాస్‌ వ్యవహారం, బాధితుల భవిష్యత్తు వైద్య సమస్యలపై ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ రాజీవ్‌ గర్గ్‌, ఇన్సిట్యూట్‌ ఆప్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ నిపుణులతోనూ చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపు నుంచి హెల్త్‌ కార్డులను కూడా జారీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. (‘మంత్రుల బసతో బాధితుల్లో ధైర్యం’)

మరిన్ని వార్తలు