సీఎం ప్రారంభించినా..

26 Nov, 2018 13:55 IST|Sakshi
తలుపులు తెరచుకోని నూతన 24గంటల మహిళా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం

నిరుపయోగంగా 24గంటల మహిళా పీహెచ్‌సీ

వైద్య సేవలందక ‘అమ్మ’ల కష్టాలు  

ఎనిమిది నెలలుగా తలుపులు మూత

విద్యుత్‌ సౌకర్యం లేక సేవలు శూన్యం

స్థానికంగా నివాసం ఉండని సిబ్బంది

ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిది నెలలు బిడ్డను తన కడుపున మోస్తుంది అమ్మ. అలాంటి అమ్మకు ప్రసవ సమయంలో సమయానికి సరైన వైద్యమందకపోతే తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే.. కానీ 24 గంటల మహిళా పీహెచ్‌సీ కదా.. పైగా సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ఆసుపత్రి భవనాలను ప్రారంభించారు.. ఇక్కడికి వెళ్తే అంతా మంచే జరుగుతుందని నమ్మి అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడికి వస్తే గర్భిణులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.

కర్నూలు, జూపాడుబంగ్లా: ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం ఓర్వకల్లు నుంచి రిమోట్‌ సిస్టం ద్వారా స్వయంగా ఈ ఆసుపత్రి నూతన భవనాలను ప్రారంభించారు. ఎనిమిది నెలలవుతున్నా నేటికీ ఆసుపత్రి భవనం తలుపులు తెరచుకోకపోవడం గమనార్హం.   ప్రస్తుతం భవనాలు నిరుపయోగంగా ఉండడంతో గర్భిణులకు ప్రసవాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే అవకాశం లేదు. రూ.1.20కోట్ల వ్యయంతో వీటిని నిర్మించినా.. కనీసం విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ఇప్పటికే భవనాల గోడలు బీటలు వారాయి. ఆసుపత్రిలో సరైన సౌకర్యాల్లేక ప్రసవాలు, కుటుంబ ఆపరేషన్లు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల మహిళలు ఆత్మకూరు, నందికొట్కూరు,  కర్నూలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ‘ముఖ్యమంత్రి తనే స్వయంగా ఈ ఆసుపత్రి భవనాలను  ప్రారంభించారు. ఇప్పటికీ ఎనిమిది నెలలైనా మహిళలకు ఇక్కడ వైద్యం అందడం లేదు. విద్యుత్‌ సౌకర్యం లేదు. సౌకర్యాలు లేవు. జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం మొత్తం నిద్రావస్థలో ఉన్నట్లు తేటతెల్లమవుతోంది’అంటూ పలువురు ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

అందుబాటులో ఉండని వైద్యులు
ఇది పేరుకు 24గంటల ఆసుపత్రి అయినా ఇక్కడ వైద్యసేవలు అందడం లేదని రోగులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల గర్భిణీ, బాలింత స్త్రీలు తీవ్ర వేదన పడుతున్నారు. రాత్రివేళల్లో గర్భిణులకు పురిటినొప్పులు వస్తే ప్రసవం చేసేందుకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24గంటల పాటు ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండాలన్న నిబంధనలున్నా అవేవీ ఇక్కడ అమలు కావడం లేదని వాపోతున్నారు. సిబ్బంది నివాసం ఉండేందుకు భవనాలున్నా ఎవ్వరూ స్థానికంగా నివాసం ఉండడడం లేదని మండిపడుతున్నారు.

భవనాలను ఉపయోగంలోకి తేవాలి
24గంటల మహిళా ఆసుపత్రి నూతన భవనాలను ఇప్పటికైనా ఉపయోగంలోకి తేవాలి.  24గంటల పాటు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తే ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయి. ఏడాది క్రితం భవనాలు నిర్మించినా ఇప్పటికీ కరెంటు సౌకర్యం కల్పించకపోవడం దారుణం. అధికారులు స్పందించి నూతన ఆసుపత్రి భవనాలు వెంటనే ప్రారంభించాలి.  - రంగస్వామి, పారుమంచాల

మరిన్ని వార్తలు