వారంలో నోటిఫికేషన్!

18 Nov, 2013 05:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న పదిహేను బోధనాస్పత్రుల్లో వైద్యుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వారం రోజుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వైద్యవిద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టులను జోనల్ వ్యవస్థ ఆధారంగానే భర్తీ చేయాలని నిర్ణయించారు. పోస్టుల భర్తీకి ఎంపిక కమిటీని వేశారు. ఈ కమిటీకి కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చైర్మన్‌గానూ, వైద్య విద్య సంచాలకులు, ఆరోగ్యశాఖ సంచాలకులు, వైద్యవిధాన పరిషత్ కమిషనర్, వైద్య విద్య సంచాలకులు (అకడెమిక్) సభ్యులుగా ఉంటారు. మెరిట్ ఆధారంగానే భర్తీ ప్రక్రియ జరపాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించాలని నిర్ణయించారు. సుమారు 650 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. 2010లో నియామకాలు జరిగినప్పుడు దరఖాస్తు చేసుకుని ఉద్యోగం రాని వారికి మూడేళ్ల వయసు సడలింపునివ్వాలని కూడా నిర్ణయించారు.
 
 మార్గదర్శకాలివే..

  •   పీజీ వైద్య డిగ్రీకి 75 శాతం వెయిటేజీ ఇస్తారు. 
  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు సర్వీసు కింద పనిచేస్తున్న వైద్యులకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. 
  • గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి ప్రతి  6 నెలలకు రెండున్నర మార్కుల లెక్కన ఇస్తారు.
  •  గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు ప్రతి ఆరు మాసాలకు రెండు మార్కులు కలుపుతారు. 
  • పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి ఆరు మాసాలకు 1 మార్కు కలుపుతారు. 
  • పీజీ డిగ్రీ పూర్తిచేసిన (ఇయర్ ఆఫ్ పాసింగ్) అంశానికి 10 శాతం మార్కుల వెయిటేజీ ఉంటుంది. 
  • మహిళలకు జనరల్ రూల్ 22-ఏ ప్రకారం నియామకాలు ఉంటాయి.
  •   ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి..స్పెషాలిటీల వారీగా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక. 
  • రూల్ ఆఫ్ రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలి.

మరిన్ని వార్తలు