పేదాస్పత్రి

11 Jul, 2018 08:53 IST|Sakshi
మందులిచ్చే గది వద్ద బారులు తీరిన రోగులు

 సర్వజనాస్పత్రిలో     ఫార్మసీ ఖాళీ

మాత్రలు ప్రైవేట్‌గా     కొనుగోలు చేస్తున్న రోగులు  

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం  

సర్వజనాస్పత్రి...జిల్లాకే పెద్దదిక్కు. ఏ చిన్న జబ్బుచేసినా నిరుపేదలంతా పరుగున వచ్చేది ఇక్కడికే. అందుకే రోజూ ఓపీ 2,000 దాకా ఉంటుంది. అడ్మిషన్‌లో 1,300 మంది దాకా ఉంటారు. కానీ ఇది పేదాస్పత్రిగా మారిపోయింది. కనీసం మందులు అందజేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడికొచ్చిన వారిని ప్రైవేటు ఫార్మసీల మెట్లెక్కిస్తోంది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా..    పట్టించుకోవాల్సిన ఉన్నతాధికారి తనకేం తెలియనట్లు వ్యవహరిస్తున్నారు..        ప్రశ్నిస్తే..మందులు పుష్కలంగా ఉన్నాయంటూ బుకాయిస్తున్నారు.   

అనంతపురం న్యూసిటీ:  సర్వజనాస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. మూడు నెలలుగా మందులు పూర్తి స్థాయిలో లేవు. దీంతో ఫార్మసీ సిబ్బంది రోగులకు అరకొరగా పంపిణీ చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే... స్టాక్‌ లేదని సమాధానం చెబుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం స్టాక్‌ పుష్కలంగా ఉందని సమాధానమిస్తోంది. రోగులు మాత్రం ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యే పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం జిల్లా కలెక్టర్‌ అయినా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

సాధారణ మాత్రలకే గతిలేదు
ఆస్పత్రిలో సాధారణ మాత్రలు కూడా అందుబాటులో లేకుండాపోయాయి. రాన్‌టాక్, పాన్‌టాప్, బీ కాంప్లెక్స్, విటమిన్‌ సీ,డీ 2 సీసీ సిరంజీలు, గ్లౌవ్స్‌ కూడా లేవు. వీటి ధర చాలా తక్కువ. ఇలాంటి వాటిని సరఫరా చేయడంలో ఆస్పత్రి యాజమాన్యం విఫలమవుతోంది. ఇకఖరీదైన మందుల కథ దేవునికెరుకనే చెప్పాలి. వీటితో పాటు 70 రకాల యాంటీబయాటిక్స్‌ మందులు పూర్తి స్థాయిలో లేవని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అలాగే బీపీని అదుపులో ఉంచే ఆమ్మోడిపిన్‌తో పాటు ట్రెమడాల్, డైజోఫామ్‌ ఇంజెక్షన్, తదితర మందులు సరఫరా ఆగిపోయింది. ఆర్‌ఎల్‌ ఐవీ ప్లూయిడ్‌ లేదు. 

ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సిందే
సర్వజనాస్పత్రికి వచ్చే రోగుల్లో 90 శాతం నిరుపేదలే. ఆస్పత్రిలో మందుల కొరత కారణంగా రూ.వందలు వెచ్చించి ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సి వస్తోంది. ‘‘అత్యవసర కొనుగోలు’’ కింద డబ్బులు వెచ్చించి రోగులకు సరఫరా చేయవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఇక.. ఎన్‌టీఆర్‌ వైద్యసేవ కేసుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద సర్జరీ చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. కానీ ఆస్పత్రిలో అలాంటి పరిస్థితే లేదు. వారుసైతం ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నారు. 

మందులు సమృద్ధిగా ఉన్నాయే...
ఆస్పత్రిలో మందుల కొరతా..? అలాంటి పరిస్థితే లేదే.. మందులు సమృద్ధిగానే ఉన్నాయి..  మందులు లేకపోతే ఎమర్జెన్సీ పర్జేసింగ్‌ కింద అందజేస్తున్నాం.–డాక్టర్‌ జగన్నాథ్, ఆస్పత్రిసూపరింటెండెంట్‌ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా