మందుల్లేవ్‌..

20 Jul, 2018 05:39 IST|Sakshi
పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో 104 వైద్య సేవలు అందిస్తున్న దృశ్యం

104 ఆరోగ్య శిబిరాల్లో అరకొర సేవలు

రక్తపోటు, బి.కాంప్లెక్స్‌ మందుల కొరత

వాహనం వద్దకు వచ్చి వెనుదిరుగుతున్న బాధితులు

జిల్లాలోని 21 వాహనాల్లోనూ ఇదే పరిస్థితి

పశ్చిమగోదావరి , భీమవరం (ప్రకాశం చౌక్‌): పేదల ఆరోగ్యం కోసం, ఉత్తమ వైద్య సేవలందించేందుకు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూపొం దిం చిన 104 పథకానికి ‘చంద్రన్న సంచార చికిత్స’గా పేరుమార్చిన తెలుగుదేశం పాలకులు పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 104 వాహనంలో గ్రామాలకు చేరుకుని అక్కడే పేదలకు వైద్య సేవలతో పాటు మందులు అందజేసేలా పథకాన్ని రూపొందించారు. వైఎస్‌ హ యాంలో 104 సేవలు ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో అందాయి.

ఆయన మరణాంతరం పథకం అరకొర సేవలతో నడుస్తోంది. 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత పథ కం పేరును ‘చంద్రన్న సంచార చికిత్స’గా మా ర్చారు. అయితే ఈ సేవలు గ్రామీణులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. నెలలో ఒక్కసారి గ్రామానికి వచ్చి పేదలకు సేవలు అందించే 104 వాహనాల్లో కనీసం మందులు కూడా ఉండటం లేదు. దీంతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. బీపీ (రక్తపోటు), షుగర్‌ మందులు కొరత సర్వసాధారణంగా మారిపోయింది. దీంతో 104 వాహనాల వద్దకు వచ్చిన వృద్ధులు మందులు లేక నిట్టూరుస్తూ వెనుదిరుగుతున్నారు.

రెండు నెలల నుంచి..
జిల్లాలో 104 వాహనాలు 21 ఉన్నాయి. రెండు నెలలుగా ఆయా వాహనాల్లో బీపీ (ఎథనోలాల్‌) మందులు, బి.కాంప్లెక్స్‌ మందులు లేవు. ప్రతి గ్రామంలో బీపీ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ప్రతి గ్రామంలో వాహనం వద్దకు 50 నుంచి 70 మంది వరకు బీపీ మందుల కోసం వస్తున్నారు. బీపీ మందుల్లో కచ్చితంగా ఉండాల్సిన ఎథనోలాల్‌ మందులు రెండు నెలలుగా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 104 సిబ్బంది ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ సరఫరా కాలేదు. దీంతో రోగులకు వీరు అందించలేకపోతున్నారు. దీంతో పాటు బి.కాంప్లెక్స్‌ మందులు కూడా 104 వాహనాల్లో లేవు. మహానేత వైఎస్సార్‌ హయాంలో 108, 104 పథకాలు సమర్థవంతంగా నిర్వహించారని, ఆయన మరణాంతరం పథకాల అమలుపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని వృద్ధులు వాపోతున్నారు.

వారంలో సరఫరా చేస్తాం
104 వాహనాల్లో అందుబాటులో లేని బీపీ రకం, బి.కాంప్లెక్సు మందుల కోసం ప్రతిపాదనలు పంపించాం. వారంలో అన్ని వాహనాల్లో మందులు ఉంచి కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం.  
– డీఎం వీఎస్‌ఎన్‌మూర్తి, 104 జిల్లా మేనేజర్‌

మరిన్ని వార్తలు