వైద్యాలయం.. మందుల వ్యాపారం

28 Mar, 2018 13:05 IST|Sakshi
మందులు విక్రయిస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రి సిబ్బంది

జోరుగా కార్పొరేట్‌ మెడిసిన్‌ విక్రయాలు

డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరిశీలన

ఎంఓయూ ఉందంటున్న విక్రయదారులు

ఎవరికీ అనుమతులు ఇవ్వలేదంటున్న డీసీహెచ్‌ఎస్‌

తణుకు అర్బన్‌:తణుకు ఏరియా ఆస్పత్రిలో కార్పొరేట్‌ మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయ ఒత్తిడో, మరే ఇతర కారణాలో కాని వైద్యాధికారుల కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.  గతేడాది నుంచి విజయవాడకు చెందిన ఉషా కార్డియాక్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో తణుకు ఏరియా ఆస్పత్రిలో ప్రతి మంగళవారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈసీజీ, ఎకో వంటి గుండె పరీక్షలు ఉచితంగానే చేస్తున్నారు. మెరుగైన సేవలు అవసరమైన వారిని విజయవాడకు రావాల్సిందిగా సం బంధిత వైద్యులు సూచిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరీక్షలు నిర్వహించిన వైద్యుడు రాసిన మందులు కార్పొరేట్‌ సంస్థ ప్రతినిధుల వద్దే కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అవి మరే దుకాణంలో దొరకని దుస్థితి. దీంతో రోగులు వీరి వద్దే మందులు కొంటున్నారు. బయట దుకాణాల్లో 20 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తారని, అయితే ఇక్కడ మాత్రం ఎమ్మార్పీకే మందులు విక్రయిస్తున్నారని రోగులు అంటున్నారు. తణుకు ఆస్పత్రిలో జరుగుతున్న ఈ మందుల విక్రయాలను మంగళవారం తణుకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌ పరిశీలించారు.

ఎంఓయూ ఉందంటూ తప్పుదోవ
మందులు విక్రయించేందుకు తమకు మెమొరాండం ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌ (ఎంఓయూ) ధ్రువీకరణ పత్రం ఉందని సదరు విక్రయాలు చేస్తున్న కార్పొరేట్‌ ఆస్పత్రి సిబ్బంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రమ్‌కు చెప్పారు. ఎంఓయూ చూపించమని విక్రమ్‌ అడగడంతో అందుబాటులో లేదని సదరు సిబ్బంది సమాధాన మిచ్చా రు. మందుల అమ్మకంపై గతంలోనే ‘సా క్షి’ కథనాలు ప్రచురించినా వైద్యాధికారులు స్పందించలేదు. రాజధాని ప్రాంతం నుంచి వచ్చిన కార్పొరేట్‌ ఆస్పత్రి కావడంతో తెరవెనుక ఏదైనా రాజకీయ హస్తం ఉందా అనే విమర్శలు లేకపోలేదు.

రూ.లక్షకు పైగా అమ్మకాలు
జిల్లాలో తణుకుతో పాటు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లలో కూడా ఈ తరహా మందుల అమ్మకాలు సదరు కార్పొరేట్‌ సంస్థ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తణుకులో వైద్య శిబిరానికి సుమారుగా 50 నుంచి 70 మంది వరకు వస్తున్నారు. రూ.లక్షకు పైగా మందుల విక్రయం జరుగుతున్నట్టు అంచనా.

ఎంఓయూ ఉందంటున్నారు
మందుల అమ్మకాలకు ఎంఓయూ ధ్రువీకరణ పత్రం పొందామని విజయవాడ ఉషా కార్డియాక్‌ ఆస్పత్రి వైద్య బృందం చెప్పారు. అయితే అది విజయవాడలో ఉందంటున్నారు. వచ్చే వారం ధ్రువీకరణ పత్రం తీసుకురమ్మని ఆదేశించాను. తీసుకురాని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.– విక్రమ్, తణుకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌

ఎటువంటి ధ్రువీకరణ ఇవ్వలేదు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేట్‌ మందుల విక్రయాలు జరపరాదు. ఇందుకోసం ఎవరికీ ఎటువంటి ఎంఓయూ ధ్రువీకరణ పత్రాలు జారీచేయలేదు. వచ్చే మంగళవారం జరిగే వైద్య శిబిరంలో మందుల విక్రయాలు మానకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.– డాక్టర్‌ కె.శంకరరావు, డీసీహెచ్‌ఎస్, ఏలూరు

మరిన్ని వార్తలు