దళారుల చేతికి కాఫీ

5 Feb, 2016 02:03 IST|Sakshi

తోటలకు పట్టాలులేక కాఫీ
ప్రాజెక్టులో సభ్యత్వానికి దూరం
సగం ధరకే దళారులకు అమ్ముకుంటున్న వైనం
గిట్టుబాటు లేక నష్టపోతున్న కాఫీ రైతులు

 
హక్కు పత్రాలు లేవనే సాకుతో కొందరు గిరిజన రైతుల నుంచి కాఫీని జీసీసీ కొనుగోలు చేయడం లేదు.  దీంతో వారికి దళారులే దిక్కవుతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి జీసీసీ ప్రకటించిన ధరల్లో సగం కూడా ఇవ్వడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో కొంతకు అమ్ముకుంటూ గిరిజన రైతులు భారీగా నష్టపోతున్నారు.
 
చింతపల్లి/గూడెంకొత్తవీధి : విశాఖ మన్యంలో గిరిజన రైతులు పండించిన కాఫీకి బయట మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు దక్కడంలేదు. కాఫీ ప్రాజెక్టులో భాగంగా గిరిజన సహకార సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న కాఫీకి మంచి ధరలు ప్రకటించి నప్పటికీ కొంత మంది రైతుల తోటలకు హక్కు పత్రాలు (పట్టాలు) లేక పోవడం వలన ప్రాజెక్టులో సభ్యులుగా చేరే అవకాశం   లేకుండా పోయింది. దీంతో చాలా మంది రైతులు దళారులపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 6 వేల టన్నుల కాఫీ ఉత్పత్తి
విశాఖ ఏజెన్సీలో గిరిజన రైతులు సుమారు లక్ష ఎకరాల్లో  కాఫీ సాగు చేస్తున్నారు.  ఏటా సుమారు 6 వేల టన్నులు కాఫీ ఉత్పత్తి అవుతుంది. కాఫీ సాగుకు ఐటీడీఏ ప్రోత్సహం అందిస్తున్నప్పటికీ మార్కెటింగ్ సౌకర్యం కల్పించక పోవడం వలన, రైతులు దళారులపై ఆధారపడుతూ వారు నిర్ణయించిన ధరలకే అమ్ముకునేవారు. గిరిజన రైతుల కాఫీకి గిట్టుబాటు ధర కల్పించేందుకు ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టును నెలకొల్పింది. గిరిజన రైతులు నేరుగా జాతీయ మార్కెట్‌లో విక్రయించుకోలేరు కాబట్టి, గిరిజన సహకార సంస్థ ద్వారా రైతుల కాఫీని సేకరిస్తోంది. నర్సీపట్నంలోని ఏపీఎఫ్‌డీసీ క్యూరింగ్ కేంద్రంలో నాణ్యమైన పప్పు తయారు చేసి ఆక్షన్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు నిర్ణయించింది. నాణ్యమైన కాఫీ త యారి, రవాణకు అయ్యే ఖర్చులన్నీ ఐటీడీఏ భరిస్తుంది. ప్రాజెక్టులో సభ్యత్వం పొందిన రైతులు మాత్రమే జీసీసీ ద్వారా విక్రయించునే అవకాశం కల్పించారు. సభ్యత్వం పొందేందుకు కాఫీ తోటలకు సంబంధించిన పట్టాలు, బ్యాంకు ఎకౌంట్, ఆధార్ కార్డు నెంబర్లు అధికారులకు అందజేయాలి. చాలా మంది రైతులకు కాఫీ తోటల పట్టాలు లేక సభ్యత్వానికి దూరమయ్యారు. జీసీసీ కిలో చెర్రీ రూ.92, పార్చిమెంటు రూ.180 గా ధరలు ప్రకటించింది. సరకు అప్పగించిన రైతుకు ముందుగా సగం సొమ్ము అకౌంటులో జమచేస్తారు. ఆక్షన్ వేసిన తరువాత మిగతా సొమ్ము చెల్లిస్తారు. ఆక్షన్‌లో ఇంతకంటే ఎక్కువ ధరలు పలికితే ఆ సొమ్ము కూడా రైతుకే చెల్లిస్తారు. తక్కువ పలికితే ఐటీడీఏ భరిస్తుంది. దళారులు కిలో చెర్రీ రూ.45, పప్పు 80కి మించి కొనుగోలు చేయడం లేదు. కళ్ల ముందే జీసీసీ మంచి ధరలకు కొనుగోలు చేస్తున్నా కాఫీ తోటలకు పట్టాలు లేక వేలాది మంది రైతులు తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్ముకోవలసి వస్తోంది. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
 
 

మరిన్ని వార్తలు