వనితా సలాం

8 Mar, 2018 10:32 IST|Sakshi
అనాథ బాలలకు అన్నం పెడుతున్న సుమలత

మహిళా దినోత్సవం నేడు

మహిళామూర్తిని వర్ణించేందుకు పదాలు చాలవు. సమాజంలో అంతటి ప్రాధాన్యం ఉన్న మహిళలు ప్రస్తుతం వివక్షను ఎదుర్కొంటున్నారు. రక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, అవి ఎందుకూ పనికి రాకుండాపోతున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో సమాజ రుగ్మతలను ఎదిరిస్తూ స్వయం సాధికారత వైపు మహిళలు అడుగులేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.

మనం సంతోషంగా ఉన్నాం. ఇదే మనకు వరమని సరిపుచ్చుకోలేదామె. అందరూ సంతోషంగా ఉండాలని తపన పడుతున్నారు. యువకుల్లో సైతం సేవాభావాన్ని పెంపొందిస్తూ దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు మీ కోసం మేము ఫౌండేషన్‌కు తెరవెనుక సూత్రధారిగా ఉంటూ నడిపిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు కొడవలూరు మండలం బసవాయపాళేనికి చెందిన గనకాల సుమలత.

కొడవలూరు: కొడవలూరు మండలం బసవాయపాళేనికి చెందిన సుమలత వివాహానంతరం నెల్లూరులో స్థిరపడ్డారు. ఆమె ఇతరులకు సాయపడటంలోనే సంతృప్తి ఉందని భావించారు. ఆమెలోని సేవాభావాన్ని భర్త హరికృష్ణకు వివరించారు. ఆమె సమాజ సేవాభావానికి ఆయన అడ్డు చెప్పకుండా తనవంతు ప్రోత్సాహించారు. భావాలకు భర్త సహకారం కూడా తోడవడంతో సేవా కార్యక్రమాల వైపు అడుగులేశారు.

సేవ దిశగా ప్రోత్సాహం
సేవా దృక్పథం ఉన్న సుమలత కార్యక్రమాల అమలుకు ఒక వేదిక అవసరమని భావించారు. ఇలాంటి కార్యక్రమాలను యువకులైతే ఎంతో ఉత్సాహంగా చేపట్టగలరని నిర్ణయించుకున్న ఆమె స్వగ్రామానికి చెందిన యువకుడు చల్లకొలుసు కార్తీక్‌లోని సేవా భావాన్ని గుర్తించారు. దిక్కులేని వారికి సాయపడేందుకు తన వంతు సాయమందిస్తానని కార్తీక్‌తో తన మనస్సులోని మాటను తెలిపారు. సేవ చేయడంపై ఆసక్తి ఉన్న అతడు తన మిత్రుడైన పోసిన సునీల్‌కుమార్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. అందుకు సునీల్‌కుమార్‌ కూడా ఉత్సుకత చూపడంతో సేవాభావమున్న స్నేహితులతో కలిసి మీ కోసం మేము ఫౌండేషన్‌ను స్థాపించారు. ఫౌండేషన్‌లో కోశాధికారిగా ఉంటున్న సుమలత సంస్థ నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమంలో తన వంతు సాయం అందిస్తున్నారు. వృద్ధులకు వస్త్ర, అన్నదానం చేయడం, ప్లాట్‌ఫారాలపై ఉంటున్న వారికి దుప్పట్లు, వస్త్రాలను అందించడం, అనాథ పిల్లలకు వారి అవసరాలను తెలుసుకొని సాయపడుతున్నారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణా లను నిలపడంలోనూ ఫౌండేషన్‌ ముందంజలో ఉంది.

సాయంలోనే తృప్తి
ఇతరులకు సాయపడటంలో ఎంతో సంతృప్తి ఉంది. మనం ఎంతగా సుఖపడినా, ఇతరులకు సాయపడటంలో ఉన్న సంతృప్తి ఎందులో ఉండదు. ఇతరుల ఆకలిని తీర్చినపుడు, ఆపదల్లో రక్తదానం చేసినప్పుడు వారు చూపే కృతజ్ఞత మనస్సును కదిలిస్తుంది. అందువల్లే ఉన్నంతలో ఇతరులకు సాయపడాలని నిర్ణయించుకున్నా. మరిన్ని సేవా కార్యక్రమాలను ఫౌండేషన్‌ ద్వారా చేపట్టాలన్నదే నా లక్ష్యం.
: గనకాల సుమలత,మీ కోసం మేము ఫౌండేషన్‌ కోశాధికారి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు