దొరకునా ‘మీసేవ’ ?

25 Dec, 2013 04:57 IST|Sakshi
దొరకునా ‘మీసేవ’ ?

 =నిరంతరం సర్వర్ల్ల డౌన్
 =సమయపాలన లేదు
 =విద్యుత్‌కోతలతో అంతరాయం
 =అధిక చార్జీల వసూలు
 =సేవల్లో జాప్యం
 =కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులు కట్టించుకోని నిర్వాహకులు
 =దరఖాస్తుదారులకు తిప్పలు

 
జిల్లాలోని మీ-సేవ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని కేంద్రాల్లో నిర్ణీత చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని ఆపరేటర్ల కారణంగా దరఖాస్తుదారులకు అవస్థలు తప్పడం లేదు. సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి తిరుగుతున్న వారూ ఉన్నారు. ఇదేనా మీ-సేవ కేంద్రాల పనితీరు అంటూ జనం మండిపడుతున్నారు.
 
 సాక్షి, చిత్తూరు: ఈ సేవ పేరును మీ-సేవగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మార్చారు. జిల్లాలో 186 మీ-సేవ కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా 81 కేంద్రాలకు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 20 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 225 రకాల సేవలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తామని అధికారులు ఘనంగా ప్రకటించారు. తక్కువ రోజుల్లోనే సర్టిఫికెట్ల జారీ, ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదంటూ ఊదరగొట్టారు. అయితే 30 లోపు సేవలు మాత్రమే ప్రజలకు అందుతున్నాయి. ఈ సేవలూ సర్వర్ సమస్య కారణంగా నెలలో పదిహేను రోజులు అందడం లేదు. ఈ పరిస్థితి మండల కేంద్రాల్లో మరింత ఎక్కువగా ఉంది. చాలాచోట్ల మీసేవ నిర్వాహకులు నిర్ణీత మొత్తం కంటే అధికంగా వసూలు చేస్తున్నారు.
     
మదనపల్లెలో 14 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. చాలా వాటిల్లో సమయపాలన పాటించడం లేదు. దరఖాస్తులను ఆయా విభాగాలకు పంపడంలో జాప్యం జరుగుతోంది. కొన్ని కేంద్రాలకు మీసేవ అనే బోర్డులూ లేవు. చాలా చోట్ల ఏఏ సేవలు పొందవచ్చో తెలిపే సూచికబోర్డులు లేవు. విద్యుత్‌బిల్లులు చెల్లించినా నిర్ణీత సమయంలో ఆన్‌లైన్ కాకపోవడంతో సర్వీసు కట్ చేస్తున్నారు.
     
సత్యవేడు నియోజకవర్గంలో మీ-సేవా కేంద్రాల పనితీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ల బ్రేక్, విద్యుత్ కోతల కారణంగా సకాలంలో సేవలు అందడం లేదు.
     
పలమనేరు నియోజకవర్గంలో 17మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 25 సేవలు మాత్రమే అందుతున్నాయి. ఏఏ సేవలకు ఎంత చార్జీ అనే వివరాలు ఎక్కడా లేవు. బెరైడ్డిపల్లె మండలంలో ప్రతి కులానికీ అఫిడవిట్ కావాలని అడుగుతున్నారు. కులం సర్టిఫికెట్‌కు చార్జీ 30 రూపాయలు. అయితే అఫిడవిట్ కోసం పలమనేరుకు వచ్చి వెళ్లేందుకు రూ.400 వరకు ఖర్చవుతోంది. మీసేవ కేంద్రం నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. సర్వర్లు అప్పుడప్పుడూ మొరాయిస్తున్నాయి. నిర్ణీత చార్జీలు వసూలు చేయడం లేదు.
     
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు మీసేవ  కేంద్రాలు ఉన్నాయి. వీటిని కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు నిర్వహిస్తున్నారు. నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల జారీ జరగడం లేదు. చిన్న సర్టిఫికెట్ కోసమూ నెలల తరబడి తిరుగుతున్న వారున్నారు. దీనిపై నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వడం లేదు.
     
నగరి నియోజకవర్గంలో ఏడు మీసేవ  కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కులం, ఆదాయం, ఓటరు కార్డు సేవలు మాత్రం అందుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ సేవలు, మున్సిపల్ ఇంటిపన్ను కట్టించుకోవడం లేదు.
     
శ్రీకాళహస్తి  నియోజకవర్గంలో 12 మీసేవ  కేంద్రాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ అధికారులు, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు సంబంధిత సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో నిర్ణీత చార్జీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. కరకంబాడి, పాపనాయుడుపేట మీసేవ కేంద్రాలు విద్యుత్‌కోతల వల్ల పని చేయడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
     
తిరుపతి నియోజకవర్గంలో తొమ్మిది మీసేవ  కేంద్రాలు ఉన్నాయి. సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. బర్‌‌త సర్టిఫికెట్లు, మరికొన్ని రెవెన్యూసేవలు అందడం లేదు. ఒక్కో సర్టిఫికెట్ కోసం నాలుగైదు సార్లు తిప్పించుకుంటున్నారు.
     
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో మీసేవ కేంద్రాల నిర్వహణ సరిగా లేదు. పెనుమూరు, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాల్లోని కేంద్రాల్లో విద్యుత్‌చార్జీలు కట్టించుకోవడం లేదు.
     
చంద్రగిరి నియోజకవర్గంలో 12  కేం ద్రాలు ఉన్నాయి. చంద్రగిరి కేంద్రంలో బర్‌‌త సర్టిఫికెట్ల జారీ, రెవెన్యూ సేవల్లో జాప్యం జరుగుతోంది. పోలీస్‌శాఖ జారీ చేసే ఎఫ్‌ఐఆర్, ఇతర సర్టిఫికెట్లు మీసేవ ద్వారా అందడం లేదు.
 

మరిన్ని వార్తలు