ఎవరికోస'మీ సేవ'

9 Nov, 2018 10:44 IST|Sakshi

సకాలంలో అందని సర్టిఫికెట్లు

స్కాలర్‌షిప్‌ కోల్పోతున్న విద్యార్థులు

ఓటరు ఐడీ కోసం అగచాట్లు

విద్యుత్‌ బిల్లులకే పరిమితవుతున్న కేంద్రాలు

మీ సేవ కేంద్రాలపై పెదవి విరుపు

చిత్తూరు కలెక్టరేట్‌ :  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సత్వర సేవలు అందుతాయని భావించిన ప్రజలకు ఇప్పటికీ నిరాశే మిగులుతోంది. అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ ప్రభుత్వం మీ–సేవ కేంద్రాలను ఏర్పాటు చేసినా కాలయాపన తప్పడం లేదు. చిత్తూరు నగరంతో పాటు జిల్లాలోని 66  మండలాల్లో  516  కేంద్రాలను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినా ఫలితం అంతంతమాత్రమే. స్కాలర్‌షిప్, ఫీజు రీఇంబర్స్‌మెంట్ల కోసం అవసరమైన కులధ్రువీకరణ  పత్రాల మంజూరుకు దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. నెలల తరబడి మంజూరు కావడం లేదనే విమర్శ వినిపిస్తోం ది. ఫలితంగా చాలామంది ఉపకార వేతనాలకు సకాలంలో దరఖాస్తులు చేసుకోలేక పోతున్నారు.  ప్రభుత్వం జారీ చేసే అన్ని సర్టిఫికెట్లను మీ–సేవల్లో తీసుకునే విధంగా అనుసంధానం చేశారు.  ఏ  సర్టిఫికేట్‌ పొందాలన్నా ఇక్కడకు  కచ్చితంగా వెళ్లాల్సిందే.

సర్టిఫికెట్ల జారీలో పారదర్శకతకుఅధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ బోర్డులు అలంకారప్రాయమయ్యా యి. వాటి ప్రకారం చెప్పిన గడువులోగా సర్టిఫికెట్లను జారీ చేయచేయడం లేదు.  తొలి రోజుల్లో  మీ–సేవ కేంద్రాల తీరు బాగానే ఉండేది. సేవలపై దరఖాస్తుదారులు సంతృప్తి చెందేవారు. రాన్రానూ పరిస్థితులు మారిపోయాయి. నిబంధనల ప్రకారం మీ–సేవ కేంద్రాలు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయాలి. కానీ ఎక్కువ గ్రామాల్లో కేంద్రాలు మూసివేస్తున్నారు. కష్టపడి దూరం వెళ్తే సర్వర్‌ సమస్య తలెత్తిందని  రెండు రోజుల తరువాత రావాలని కేంద్రం నిర్వాహకులు చెబుతున్నారు.  రెండు రోజుల తరువాత వెళ్లినా మళ్లీ పాత సమాధానమే. విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి మాత్రమే  కేంద్రాలు ఉపయోగపడుతున్నాయని చిత్తూరుకు చెందిన ఓ విద్యార్థి వాపోయాడు. అత్యవసర ధ్రువపత్రాలు సకాలంలో అందడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించడం లేదని బాధితులు చెబుతున్నారు. సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో కొద్దో గొప్పో చెల్లిస్తే అప్పటికప్పుడే సర్టిఫికెట్‌ మంజూరు చేస్తారనే భావన పెరిగిపోయింది. స్తోమత లేని వారు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తు చేసుకున్న ఓటర్లు ఐడీ కార్డులను పొందాలం టే మీ–సేవలను ఆశ్రయించాలి.  అక్కడ ఓటరు కార్డు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రతి కేంద్రంలో ఓటరు కార్డు ఐడీ కావాలంటే రూ.25 చెల్లిస్తే చాలని బోర్డులు మాత్రం దర్శనమిస్తున్నాయి. అధిక మొత్తంలో చెల్లించినా సకాలంలో ఐడీ ఇవ్వడం లేదని దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు