‘మీకోసం’కు వినతుల వెల్లువ

23 Feb, 2016 02:36 IST|Sakshi
‘మీకోసం’కు వినతుల వెల్లువ

 కర్నూలు(అగ్రికల్చర్): కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి.  వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వీరి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, జిల్లా పౌర సరఫరాల అధికారి తిప్పేనాయక్, మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ మస్తాన్ వలి వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. రెవెన్యూ అధికారులు కుమ్మకై  పాములపాడు మండలం  వెంపెంట గ్రామంలోని తమ భూమిని  మూరవాని దేవమ్మ, ఆదామ్ పేర్ల మీద ఆన్‌లైన్‌లో ఎక్కించారని మాజీసైనికుడి కుమారుడు ఎస్‌కే బాషా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విచారించి న్యాయం చే యాలని కోరారు.

తన భార్యపేరుమీద కర్నూలు నగరంలోని జొహరాపురంలో ఉన్న ప్లాట్‌లను  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని,దీనిపై విచారించాలని  షేక్‌ఇస్మాయిల్ అనే మాజీ సైనికుడు కోరారు.
స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలని నందికొట్కూరులో నివసిస్తున్న పగిడ్యాల చెంచుగూడెంకు చెందిన  రాముడు, రంగస్వామి  కోరారు.
కర్నూలు శివారులోని రాజీవ్ స్వగృహలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వెంటనే నివారించాలని ఆ కాలనీకి చెందిన శేఖర్, రమేష్ తదితరులు కోరారు.
 
సమస్యలను సత్వరం పరిష్కరించండి  -అధికారులకు జేసీ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన అన్ని రకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని  జాయింట్‌కలెక్టర్ సి. హరికిరణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా  వివిధ సమస్యలను తెలుసుకున్న జేసీ పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  వినతులను మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు.  ఇప్పటి కే వివిధ శాఖలకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వీటిని వచ్చే వారంలోపు పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు