దండుకుంటున్నా..మీ సేవ

1 Dec, 2018 14:02 IST|Sakshi

మీ–సేవా కేంద్రాల్లో అదనపు వసూళ్లు

నష్టపోతున్న రైతులు

చేష్టలుడిగి చూస్తున్న అధికారులు  

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు కబలిస్తోంది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దేవుడా ఏమిటీ దయనీయ పరిస్థితి అని రైతులు వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించింది. నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 2 వరకు ఈ సభలు నిర్వహిస్తున్నారు.తమకు కొంతైనా ఊరటగా ఉంటుందని బీమా చేయించడానికి ఆసక్తి కనబరుస్తుండగా కరువు రైతులను కూడా మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు దండుకుంటున్నారు. అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.  

ప్రొద్దుటూరు :  ఓ వైపు కరువు పరిస్థితులు ఉన్నా వరుణదేవుడు కరుణించక పోతాడా అన్న ఆశతో రబీ సీజన్‌లో రైతులు పంటలను సాగు చేశారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అత్యధికంగా శనగ పంటను సాగు చేయగా మిగతా ప్రాంతాల్లో శనగ, వరి, జొన్న తదితర పంటలు వేశారు. వీటిని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల వచ్చిన తిత్లీ, గజ తుపాన్లపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.  వేలెడు లోతున కూడా భూమిలోకి నీరు ఇంక లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 బీమా ప్రీమియం చెల్లిస్తున్న రైతులు
ఇది ఇలా ఉండగా పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంపై నవంబర్‌ 26వ తేదీ నుంచి డిసెంబర్‌ 2వ తేదీ వరకు గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను ఆదేశించింది.   డిసెంబర్‌ 15 వరకు శనగ పంటకు, జొన్న, వేరుశనగ, ఉల్లి, మిరప, పొద్దుతిరుగుడు పంటలకు డిసెంబర్‌ 31, వరి పంటకు  2019 జనవరి 15  వరకు బట్టి ప్రీమియం చెల్లించేందుకు గడువు విధించింది.  కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులంతా బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో ఎక్కువగా శనగ రైతులు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 46వేల మంది  ప్రీమియం చెల్లించగా జిల్లాకు సంబం«ధించిన రైతులే 21వేల మంది ఉన్నారు. తర్వాత ప్రకాశం జిల్లాలో 10వేల మంది, అనంతపురం జిల్లాలో 9,300 మంది, కర్నూలు జిల్లాలో 4,800 మంది, విజయనగరం జిల్లాలో 552 మంది, కృష్ణాజిల్లాలో 74 మంది, గుంటూరు జిల్లాలో 25, చిత్తూరు జిల్లాలో 7 మంది ఇప్పటి వరకు ప్రీమియం చెల్లించారు.
 
అదనపు వసూళ్లు..

బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు అక్కడే బీమా ప్రీమియంను వసూలు చేయడం జరుగుతుంది. బ్యాంకు రుణం పొందనివారు, కౌలు రైతులు ఎంపిక చేసిన మీ–సేవా కేంద్రాల్లో (సీఎస్‌సీ) చెల్లిస్తున్నారు.  దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 284 మీ–సేవా కేంద్రాలు ఉండగా ఎంపిక చేసిన కేంద్రాల్లోనే వీటికి అనుమతి మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి రైతు బీమా ప్రీమియానికి సంబంధించిన దరఖాస్తుపై రూ.24 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మీ–సేవా కేంద్రం నిర్వాహకులు ప్రతి ఎకరాకు ప్రీమియంతోపాటు రూ.30 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఎకరా శనగ పంట ప్రీమియం రూ.270 కాగా రూ.300 చొప్పున ప్రొద్దుటూరులో వసూలు చేస్తున్నారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో కూడా ఈ విధంగానే ఫిర్యాదులు అందుతున్నాయి. ఎక్కువ మంది రైతులు ప్రొద్దుటూరుకు వచ్చి ప్రీమియం చెల్లిస్తున్నారు. పలువురు రైతులు ప్రొద్దుటూరు మండల వ్యవసాయాధికారి ఆర్‌వీ సాగర్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన నిబంధనలను వివరించారు. సమస్యను వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు మురళీకృష్ణకు ఫిర్యాదు చేయగా ఆయన కూడా ఇదే విషయాన్ని తెలిపారు. మిగతా వరి, జొన్న పంటలకు కూడా ఇలానే అదనపు వసూళ్లు చేస్తున్నారు. వేసిన పంటలు ఎండిపోయి తాము ఇబ్బందులు పడుతుంటే మీ–సేవా నిర్వాహకులు దోచుకోవడం ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.  

మరిన్ని వార్తలు