మీసేవలపై సమ్మెట!

17 Jan, 2019 08:02 IST|Sakshi
మీసేవ కేంద్రం

నేటినుంచి మీసేవ నిర్వాహకుల సమ్మెబాట

అత్యవసర సేవలపై పెను ప్రభావం

చర్యలపై సర్కారు మీన మేషాలు

విజయనగరం గంటస్తంభం: ప్రతి పనికీ ప్రజలు కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవడం, అధికారులకు ఇవ్వడం, వాటిని పరిశీలించి వారు అవసరమైన పత్రాలు జారీ చేయడం, ఇతర పనులు జరిగేవి. ప్రజలకు ఆ సేవలు మరింత వేగంగా, సులభంగా  అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. మొదట్లో రెవెన్యూ, విద్యుత్‌ శాఖల సేవలతో ప్రారంభమై క్రమేపీ మీసేవలు విస్తరించాయి. ప్రస్తుతం 33 శాఖలకు సంబంధించి 390 రకాల పత్రాలు, పనులు మీసేవ కేంద్రాల నుంచి అందుతున్నాయి.

నేటి నుంచి సేవల నిలిపేత
మీసేవ కేంద్రాల నిర్వహకులు గురువారంనుంచి మీసేవ కేంద్రాలు మూసేస్తున్నారు. వారు తమ సమస్యలు పరిష్కారం కోసం సమ్మెబాట పడుతున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా ఎన్నోఏళ్లుగా తాము సేవలందిస్తున్నా... ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం తమ ను పట్టించుకోవడం లేదంటూ నిరసనకు దిగుతున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రభుత్వ సేవలన్నీ నిలిపేస్తామని ఇప్పటికే జిల్లా మీసేవ కేంద్రాల ఆపరేటర్లు సంయుక్త కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈవిషయాన్ని మీసేవ కేంద్రాలు నిర్వాహాకులు కూడా మరోసారి స్పష్టం చేశారు. అంటే జిల్లాలో ఉన్న 460 మీసేవ కేంద్రాల్లో గురువారం నుంచి ఎటువంటి ప్రభుత్వ సేవలు లభించవన్నమాట.

ఇబ్బందులు తప్పవు
మీసేవ కేంద్రాల నిర్వాహకులు సమ్మె బాట పడితే ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం మీసేవ కేంద్రాలకు, ప్రజలకు మధ్య విడదీయలేనంత బంధం ఏర్పడింది. ప్రతీ పనికీ మీసేవ కేంద్రాలకు ప్రజలు వెళుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ సేవల కోసమైతే అక్కడికే వెళ్లాల్సి రావడం ఇందుకు ఒక కారణం. రెవెన్యూ శాఖలో 60కు పైగా పత్రాలు పొందాలంటే మీసేకు కేంద్రాలకు వెళ్లాల్సిందే. రవాణాశాఖ, మున్సిపాల్టీ, వ్యవసాయం, లేబర్, విద్యుత్‌ తదితర శాఖల సేవలు కూడా ఎక్కువగా వీటి ద్వారానే అందుతున్నాయి. ఇప్పుడు వారు సమ్మెలోకి వెళ్లడంతో ధ్రువపత్రాలు పొందడం, పనులు జరగడం ప్రశ్నార్ధకంగా మారింది. అత్యవసర సేవలపై ఇది ప్రభావం చూపనుంది. సమ్మె నోటీసు ఇచ్చి వారం రోజులు గడిచినా ప్రభుత్వం ఇంతవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో అత్యవసరనుకునే కొన్ని పత్రాలు పొందాలంటే పరిస్థితి ఏమిటన్న ఆందోళన జనాల్లో నెలకొంది. భూముల రిజిస్ట్రేషన్‌కు మీసేవలే కీలకం.

సమ్మె చేస్తాం
మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇవ్వట్లేదు. చాలీచాలని కమీషన్‌ ఇస్తోంది. దీనినే నమ్ముకుంటే మా జీవనం కష్టతరమవుతోంది. అందుకే సమ్మె బాట పడుతున్నాం. గౌరవ వేతనం ఇవ్వడం, విద్యుత్‌ బిల్లులు ప్రభుత్వమే భరించాన్నది ప్రధాన డిమాండ్‌. ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుంది.– రాజేష్, మీసేవ నిర్వాహకులసంఘం నాయకుడు

ప్రభుత్వం నుంచి ఎలాంటిసమాచారం లేదు
మీసేవ కేంద్రాల నిర్వాహకులు సమ్మె చేస్తామని, సేవలు నిలిపేస్తామని సంయు క్త కలెక్టర్‌కు నోటీసు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. అయితే దీనిపై ఏమి చర్యలు తీసుకోవాలన్నది ఉన్నతాధికారులు నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు.– శ్రవణ్‌కుమార్, ఇ–జిల్లా మేనేజర్‌

మరిన్ని వార్తలు