ప్రతి కార్యకర్తను కలుస్తా

24 Aug, 2014 01:03 IST|Sakshi
ప్రతి కార్యకర్తను కలుస్తా

 సాక్షి, ఏలూరు:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడిగా నియమితులైన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఈనెల 27న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏలూరు ఎన్‌ఆర్ పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఈ వేడుకను అట్టహాసంగా జరపాలని పార్టీ అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే నానికి ఫోన్ ద్వారా తమ ఆకాంక్షను వెల్లడించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు కష్టాల్లో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో బాధ్యతల స్వీకారోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుకోవాలని నాని భావిస్తున్నారు. బొకేలు, పూల దండలు తీసుకు రావద్దని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
 
 ఎన్నికల తర్వాత నిరాశకు గురైన పార్టీ నేతలందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం ఓ అవకాశమ ని ఆళ్ల నాని భావిస్తున్నారు. జిల్లాలోని 15 అసెంబ్లీ, మూడు లోక్‌సభ సెగ్మెంట్ల ముఖ్యనేతలను ఇప్పటికే ఫోన్ ద్వారా నాని ఆహ్వానించారు. సెప్టెంబర్ 10నుంచి జిల్లా అం తటా పర్యటించేందుకు నిర్ణయించుకున్న ఆయన రోజు కొక నియోజకవర్గం చొప్పున 15 నియోజకర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దశలవారీగా జిల్లా, మండలస్థాయి కమిటీలను నియమించనున్నారు. సీనియర్ నేతల సహకారంతో అందరినీ కలుపుకుని పార్టీకి పునరుజ్జీవం తీసుకురావడానికి పాటుపడతానని నాని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలోనే ప్రతి కార్యకర్తను కలుస్తానని ఆయన చెప్పాన్నారు. పదవీ బాధ్యతల స్వీకారాన్ని వేడుకలా కాకుండా జిల్లాలో పార్టీ పునర్నిర్మాణానికి తొలి అడుగుగా ఉండాలని భావిస్తున్నట్టు ఆళ్ల నాని ‘సాక్షి’తో అన్నారు.
 
 పార్టీలో నూతనోత్సాహం
 పార్టీ జిల్లా సారథిగా నాని నియమితులు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అనుభవం, ఆలోచన ఉన్న నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. పార్టీని ఆయన సమర్థవంతంగా నడిపించగలరనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న సీనియర్ నాయకులు నాని నియూమకంతో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. మండలాధ్యక్షుల నియామకాన్ని కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తిచేయాలని నాని ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న వారికి సముచిత స్థానం కల్పించేందుకు నాని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు