ఆరు శాఖలకే పరిమితమైన సమావేశం

29 Dec, 2014 01:23 IST|Sakshi

సీతంపేట: సీతంపేట ఐటీడీఏ 68వ పాలక వర్గ సమావేశం తూతూ మంత్రంగానే ఆదివారం ముగిసింది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో 26 ప్రభుత్వ శాఖలు ఉండగా కేవలం ఆరు శాఖలపైనే చర్చకు పరిమితమైంది. వాస్తవంగా అన్ని శాఖలపై చర్చ జరగాల్సి ఉండగా 20 శాఖలను అసలు పట్టించుకోలేదు. అజెండాలో కూడా ఆయా శాఖలకు మంజూరైన నిధులు, చేసిన ఖర్చులు, కార్యకలాపాలు రూపొందించారు. అరుుతే కేవలం ఆరు శాఖలపైనే చర్చ జరిపి పాలకవర్గ సమావేశం అయ్యిందనిపించారు.
 
 వ్యవసాయశాఖ, ట్రాన్స్‌కో, గ్రామీణ నీటి పారుదల విభాగం, గిరిజన సంక్షేమం, ఇంజినీరింగ్ విభాగం, గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛందసంస్థల కార్యకలాపాలు, అటవీశాఖపై మాత్రమే చర్చ జరిగింది. ముఖ్యమైన గిరిజన సంక్షేమశాఖ, ఉద్యానవనశాఖ, ఐఏపీ, జాతీయగ్రామీణాభివృద్ధి పథకం, ప్రత్యేక ఉపాధి పథకం, వెలుగు, గృహనిర్మాణశాఖ, మలేరియా విభాగం, వైద్యశాఖ, గిరిజన సహకార సంస్థ, ట్రైకార్, స్త్రీ శిశుసంక్షేమశాఖ, భూగర్భజలశాఖ తదితర శాఖలపై చర్చజరగాల్సి ఉన్నప్పటకీ వీటి జోలుకు ఎవరూ పోలేదు. సమయం లేదన్న సాకుతో ముగించారు.
 
 ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన సమావేశాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు ముగించారు. ఒకానొక దశలో పలాస ఎమ్మెల్యే శ్యాంసుందర్ శివాజీ కూడా సమావేశంపై అసంతృప్తి చెందారు. అన్ని శాఖలపై చర్చజరగకుండా సమస్యలు ఎలా పరిష్కారమౌతాయని  మంత్రి అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో సమావేశం జరిగితే సమస్యలపై సభ్యులు ప్రశ్నించడానికి అవకాశముండేదన్నారు. కొన్ని శాఖలపై జెడ్పీ సమావేశంలో చర్చించినందున ఇప్పుడు చర్చించడం లేదని మంత్రి అచ్చెన్న చెప్పడం గమనార్హం. ఇకపై జిల్లా పరిషత్ సమావేశం జనవరిలో, ఐటీడీఏ పాలక వర్గ సమావేశం ఫిబ్రవరిలో పెడితే బాగుంటుందని శివాజీ సూచించారు.
 
  నోరు కదపని ఎంపీ
 పాలకవర్గ సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్‌నాయుడు  హాజరైనప్పటికీ కనీసం నోరు కదపలేదు. సమావేశంలో పలాస శాసనసభ్యుడు శ్యాంసుందర్ శివాజీ, పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణలు మాత్రమే సమస్యలపై ప్రశ్నలవర్షం కురిపించారు. అవునంటే కాదనిలే అన్న చందంగా ఒకానొక సందర్భంలో మంత్రి అచ్చెన్న ఒకటి మాట్లాడితే దానికి ప్రభుత్వవిప్ కూన రవికుమార్ అడ్డుతగలడం కనిపించింది. అటవీశాఖ పర్మిషన్ లేకపోయినా, గిరిజన సంక్షేమశాఖ రహదారులు నిర్మించాలని, గిరిజనుల ఆవాస ప్రాంతాలు కాబట్టి డీఎఫ్‌వో చూసీచూడనట్టు వ్యవహరించాలని మంత్రి అచ్చెన్న కోరారు. దీనికి స్పందించిన విప్ రవికుమార్ స్పందిస్తూ చట్టబద్ధంగా రహదారులు వేయాలన్నారు. అన్ని శాఖలపై చర్చ జరగకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంపీపీలు, జెడ్‌పీటీసీ సభ్యులకు సమస్యలపై చర్చించే అవకాశం లేకపోయింది.
 

మరిన్ని వార్తలు