ఆ జీవో నిజం కాకపోతే ఈ వేధింపులేంటి?

2 Nov, 2017 01:04 IST|Sakshi

50 ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపే ముసాయిదా జీవో లీకు చేశారని మరో ఎస్‌వోపై వేటు

ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సచివాలయ ఉద్యోగుల సమావేశం

త్వరలో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 50 ఏళ్లకు తగ్గించే ఆలోచనే లేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి ముసాయిదా జీవో పత్రం రూపొందించ లేదని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఇదివరకు స్పష్టీకరించారు. ఇదే నిజమైతే ఈ ముసాయిదా జీవో పత్రాన్ని లీకు చేశారని, దొంగిలించారని ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్లపై సస్పెన్షన్‌ వేటు ఎలా వేశారు? అంటే  ముసాయిదా జీవోను రూపొందించినట్లు ప్రభుత్వం అంగీకరించినట్లే కదా? సీఎం, మంత్రి అబద్ధాలు చెప్పారా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి.          
– ఉద్యోగ వర్గాల డిమాండ్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వ పెద్దల అసహనం పెరిగిపోతోంది. తమకు నచ్చని పని చేసే వారిని టార్గెట్‌ చేస్తూ వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపే ముసాయిదా జీవోను లీకు చేశారని ఆరోపిస్తూ సచివాలయంలో వారం క్రితం ఓ ఉద్యోగిపై, తాజాగా మరో ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం తమకు సరిపడని అధికారులను తీవ్ర వేధింపులకు గురి చేస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. మూడున్నరేళ్లలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కూడా ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. సీఎంకు బంధువైన ఎంవీఎస్‌ మూర్తికి చెందిన గీతం మెడికల్‌ కాలేజీకి డీమ్డ్‌ హోదా ఇవ్వడానికి నిరాకరించారనే నెపంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను యువజన సర్వీసు శాఖకు ప్రభుత్వం మార్చేసింది.

పురపాలక శాఖలో పనిచేస్తున్న ఎ.గిరిధర్‌ కూడా ప్రభుత్వ ఒత్తిళ్లను భరించలేక కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఆర్థిక శాఖలో పని చేస్తున్న సీనియర్‌ అధికారి పి.వి.రమేష్‌ను ఉద్దేశ పూర్వకంగా అటవీ శాఖకు పంపడంతో ఆయన కూడా ఢిల్లీ బాట పట్టారు. విశాఖ భూ కుంభకోణాలకు అనుకూలంగా వ్యవహరిం చలేక, ముఖ్య నేతల ఒత్తిళ్లను తట్టుకోలేక అప్పటి కలెక్టర్‌ యువరాజ్, లవ్‌ అగర్వాల్, ప్రవీణ్‌ ప్రకాశ్‌ తదితరులు రాష్ట్రాన్ని వీడి కేంద్ర సర్వీసులకు వెళ్లిన వారే. కొన్ని నెలల కిందట సుమితాదావ్రా కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆమె పట్ల మంత్రి అనుచితంగా ప్రవర్తించడంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆమె రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయారు.

ఇక్కడి ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, కక్ష సాధింపు చర్యలను తట్టుకోలేకే ఆంధ్రప్రదేశ్‌ను వీడుతున్నట్లు వీరు ఆయా సందర్భాలలో వెల్లడించిన విషయం విదితమే. సివిల్‌ సర్వీసులకు చెందిన అధికారులే కాకుండా తహశీల్దారు స్థాయి అధికారులను కూడా ప్రభుత్వ ముఖ్యులు, అధికార టీడీపీకి చెందిన నేతలు వదలడంలేదు. తహశీల్దారు ద్రోణవల్లి వనజాక్షి అంశమే ఇందుకు ఉదాహరణ.  ఇటీవల సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రవాణా శాఖ కార్యదర్శి ఎన్‌.బాలసుబ్రమణ్యంపై విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులు దాదాపు దాడి చేసినంత పని చేశారు. దుర్భాషలాడారు. ఈ పరంపరలో రిటైర్‌ అవుతున్న అధికారులనూ వదలడం లేదనేందుకు భన్వర్‌లాల్‌ ఘటనే నిదర్శనం. ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని తగ్గించడానికి జరుగుతున్న లోగుట్టు ప్రయత్నాలు బట్టబయలు కావడాన్ని సాకుగా చూపుతూ ఇద్దరు సచివాలయ ఉద్యోగులపై వేటు వేయడాన్ని ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.  

ప్రతిపాదనే లేకపోతే దానిని ఎలా దొంగిలిస్తా
‘ఉద్యోగులను 50 ఏళ్లకే ఇంటికి పంపించే ముసాయిదా జీవో ప్రతిపాదనే లేదని ప్రభుత్వం చెప్పింది. అలాంటపుడు ఆ జీవో ప్రతులను దొంగిలించానని నాపై ఆరోపణలు మోపుతూ నన్ను సస్పెండ్‌ చేయడం ఎంత వరకు న్యాయం? ఒక ఉన్నతాధికారి అహాన్ని సంతృప్తి పరిచేందుకు మాపై సస్పెన్షన్‌ వేటు వేశారు. నిజాలు విచారణలో తేలుతాయి. ఈ సస్పెన్షన్‌ల వ్యవహారాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ దృష్టికి తీసుకెళ్లాము. ఇప్పటికైతే ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదు. రెండు రోజుల్లో వారి స్పందన ఆధారంగా భవిష్యత్‌ కార్యాచరణ చేపడతాం’ అని వెంకట్రామిరెడ్డి మీడియాకు వివరించారు.

ముసాయిదా జీవోను పత్రికలకు చేరవేశారట
ఉద్యోగులను 50 సంవత్సరాలకే ఇంటికి పంపే ముసాయిదా జీవోను లీకు చేశారని ఆరోపిస్తూ వారం క్రితం న్యాయశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ తిమ్మప్పను న్యాయశాఖ కార్యదర్శి సస్పెన్షన్‌ చేయడం మరవక ముందే బుధవారం జలవనరుల శాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ వెంకట్రామిరెడ్డిని ఆదే కారణంతో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సస్పెండ్‌ చేస్తూ ఆఫీస్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ఈ ముసాయిదా జీవో (విజిలెన్స్‌ ఫైల్‌) సమాచారాన్ని దొంగిలించి పత్రికలకు చేరవేశారని వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్‌ ఆర్డర్‌లో పేర్కొన్నారు. దీనిపై సచివాలయ ఉద్యోగులందరూ వెంకట్రామిరెడ్డికి బాసటగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం ఒక పక్క రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగుతుండగా, మరో పక్క సచివాలయం మూడో బ్లాకు వద్ద ఉద్యోగులందరూ సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఉద్యోగులు మండిపడ్డారు.

మరిన్ని వార్తలు