చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉపాధి - శిల్పా చక్రపాణి

3 Nov, 2019 10:52 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, చిత్రంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మెల్సీ చల్లా 

శ్రీశైల నియోజకవర్గాన్ని ఉద్యోగుల ఖిల్లాగా మారుస్తాం 

మెగా జాబ్‌మేళాలో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి

అందివచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి– ఎంపీ పోచా 

సాక్షి, ఆత్మకూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే  శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. శిల్పాతో పాటు   నంద్యాల ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ  శ్రీశైల నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆత్మకూరులో అత్యధికంగా పేద కుటుంబాలు ఉన్నాయని.. వీరికి ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటకు కృషి చేస్తానన్నారు.  త్వరలో ఈ ప్రాంతాన్ని ఉద్యోగుల ఖిల్లాగా మారుస్తానని చెప్పారు. అందులో భాగంగానే 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు  23 కంపెనీలతో   మెగా జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జాబ్‌మేళాకు భారీగా హాజరైన నిరుద్యోగులు 

డీఎస్సీకీ ప్రిపేర్‌ అవుతున్న వారికి స్థానికంగా ఉచిత కోచింగ్‌ ఇప్పిస్తానని చెప్పారు. నందికొట్కూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధి శిల్పాతోనే సాధ్యమన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామ,వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత  తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అంతకుమునుపు వైఎస్సార్‌సీపీ నాయకులు శిల్పాకార్తీక్‌ రెడ్డి, శిల్పా భువనేశ్వరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్‌డీఎ పీడీ శ్రీనివాసులు, తహసీల్దార్‌ ఆదినారాయణ, ఎంపీడీఓ కృష్టమోహన్, సీఐ కళావెంకటరమణ, వైఎస్సార్‌సీపీ నాయకులు అంజాద్‌అలీ, చిట్యాల వెంకటరెడ్డి, శరభారెడ్డి, సులేమాన్, సుల్తాన్, ఫరుక్, సురేష్, దినకర్, నాగేశ్వరరెడ్డి, డిగ్రీకళాశాల కరస్పాండెంట్‌ గోపిశెట్టి వసుంధర, వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్‌ సభ్యులు స్వామి, ముర్తుజా, రెహమాన్, కలిములా పాల్గొన్నారు.  

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 
అందివచ్చిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువకులు  సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు.  పని ఏదైనా ఇష్టపడి చేస్తే  మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని..ప్రయోజకులై వాటిని తీర్చాలన్నారు. 
– ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి   

జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయం 
జిల్లాలో మారుమూల నియోజకవర్గం శ్రీశైలమని ఆలాంటి ప్రాంతంలో ఎమ్మెల్యే శిల్పా మెగా జాబ్‌ మేళా నిర్వహించడం అభినందనీయమని  ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.  శ్రీశైలాన్ని మోడల్‌ నియోజకవర్గంగా చేస్తామని చెప్పారు.  ఏ ముఖ్యమంత్రి  చేయని విధంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  ప్రజా  సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం గొప్ప విషయమన్నారు.     
– చల్లా   రామకృష్టారెడ్డి, ఎమ్మెల్సీ 

మరిన్ని వార్తలు