కరోనాపై పోరు: ఏపీకి భారీ విరాళం

27 Mar, 2020 16:28 IST|Sakshi
మేఘా సంస్థ తరపున సీఎం వైఎస్‌ జగన్‌కు విరాళం అందజేస్తున్న కృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్‌ చేపడుతున్న చర్యలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్వయంగా అందజేశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కృష్ణారెడ్డి ప్రశంసించారు. యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వం యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి కరోనా మహమ్మారిని కట్టడి చేస్తోందన్నారు. మొదటి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన వెంటనే అప్రమత్తం కావడంతో పాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వైరస్‌ తీవ్రత తగ్గిందని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సాయం అందించాలన్న ఉద్దేశంతో విరాళం అందజేసినట్లు తెలిపారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.

సిద్దార్థ విద్యా సంస్థల ఔదార్యం
సిద్దార్థ విద్యా సంస్థల యాజమాన్యం, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రూ. 1.30 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, దేవినేని అవినాష్  సమక్షంలో సిద్దార్థ విద్యాసంస్థల కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందించారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ రూ. 20 లక్షల విరాళం
కరోనా వ్యతిరేక పోరాటానికి మద్దతుగా సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ రూ. 20 లక్షల విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. (సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ)

మరిన్ని వార్తలు