ఎందుకి'లా'

25 Jan, 2020 11:46 IST|Sakshi
బసవతారకం న్యాయకళాశాల

కడప న్యాయ కళాశాలలో తమిళ తంబీల హవా

టీడీపీ నాయకుడు గోవర్ధన్‌రెడ్డికి చెందిన కళాశాల ప్రిన్సిపాల్‌ అరెస్టు

విజిలెన్స్‌ దాడుల్లో బట్టబయలైన నిజస్వరూపం

కడప అగ్రికల్చర్‌/వైవీయూ : తీగ లాగితే డొంక కదలడమంటే ఇదేనేమో..తమిళనాడులో ఓ ఘటన ఆధారంగా సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు దాడులు చేయడంతో ఇక్కడి న్యాయకళాశాలల్లోని డొల్లతనం బట్టబయలైంది. వివరాలిలా..కడపలోని శ్రీబసవతారకం న్యాయకళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా బీఈడీ, డీఎడ్‌ కళాశాలలు నిర్వహిస్తున్నారు. కళాశాల కరస్పాండెంట్‌ టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, వైవీయూ మాజీ పాలకమండలి సభ్యుడు ఎస్‌. గోవర్ధన్‌రెడ్డిది కావడం గమనార్హం. ఇందులో ప్రవేశాలు 50 శాతం లాసెట్‌ ద్వారా మరో 50 శాతం మేర యాజమాన్యకోటా కింద కల్పిస్తారు. లాసెట్‌కు ఆశించిన మేర ప్రవేశాలు జరగకపోవడంతో వీరి పంటపండింది. యాజమాన్య కోటా పేరుతో పొరుగు రాష్ట్రాల విద్యార్థులను ప్రలోభపెట్టి ప్రవేశాలు కల్పిస్తున్నారు. కళాశాలలోని 320 సీట్లలోదాదాపు 300 వరకు సీట్లను తమిళనాడు విద్యార్థులతోనే భర్తీ చేస్తున్నారు. ప్రవేశాలు పొందిన తర్వాత తమిళనాడులోనే పనిచేసుకుంటూ, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసుకుంటూ పరీక్షల సమయంలోనే ఇక్కడకు వచ్చేవారు. తమిళనాడుకు చెందిన  ప్రభుత్వ ఉద్యోగి  57వ ఏట ఇదే తరహాలో ప్రవేశం పొందాడు.

పరీక్షల సమయంలో సెలవులు పెట్టి వచ్చి రాసి పట్టా సాధించాడు. అక్కడి బార్‌ అసోసియేషన్‌లో ఇతని సభ్యత్వానికి న్యాయవాదుల అభ్యంతరం పెట్టడంతో నానా హంగామా చేసినట్లు తెలిసింది. సదరు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించగా సెంట్రల్‌ విజిలెన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గత నెలలో బసవతారకం న్యాయకళాశాలకు అధికారులు వచ్చి రికార్డులను తీసుకుని వెళ్లారు.  తమిళనాడులో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, కడపలో రెగ్యులర్‌ విధానంలో న్యాయవిద్య ఎలా పూర్తిచేశారన్న అంశంపై పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో  కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్‌ హిమవంత్‌కుమార్‌ను సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు శుక్రవారం అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇది బయటపడిన ఒక ఘటన మాత్రమే. ప్రవేశాలతో తమ వర్సిటీకి సంబంధం ఉండదని యోగివేమన విశ్వవిద్యాలయం అధికారులు స్పష్టం చేశారు. కరస్పాండెంట్‌ ప్రమేయం లేకుండా ప్రిన్సిపాల్‌  అక్రమ ప్రవేశాలు కల్పించే సాహసం చేయరన్నది బహిరంగ రహస్యం. వివరణ కోరేందుకు కళాశాల కరస్పాండెంట్‌ ఎస్‌. గోవర్ధన్‌రెడ్డిని ఫోన్‌లో ప్రయత్నించగా, సెల్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది.

మరిన్ని వార్తలు