ఆ పరిశ్రమలు వెళ్లిపోవడం అవాస్తవం

7 Nov, 2019 05:33 IST|Sakshi

గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతున్నాం

మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి రిలయన్స్, అదానీ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకొని వెళ్లిపోతున్నాయంటూ వివిధ పత్రికల (సాక్షి కాదు)లో వచ్చిన వార్తలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఖండించారు. పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి విభిన్న విధానాలుంటాయని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోందన్నారు.  

వివాదాస్పద భూములిచ్చిన గత ప్రభుత్వం
గత ప్రభుత్వం వివాదస్పదమైన భూములను రిలయన్స్‌ గ్రూపునకు కేటాయించడంతో ప్రస్తుత ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ప్రత్యామ్నాయ భూములను ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. గతంలో కేటాయించిన 136 ఎకరాల భూమిపై 15 మంది రైతులు కోర్టులో కేసులు దాఖలు చేయడంతో ఆ భూములను రిలయన్స్‌ వినియోగించుకోలేక పోతోందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వివాద రహిత భూములను కేటాయించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. త్వరలోనే రిలయన్స్‌ సంస్థ ప్రతినిధులతో చర్చించనున్నట్లు మంత్రి  పేర్కొన్నారు. అదాని ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఐటీ శాఖ అదాని గ్రూపు ప్రతినిధులతో  చర్చలు నిర్వహిస్తోందన్నారు. ఈ విషయాలను దృష్టిలోపెట్టుకొని అవాస్తవ కథనాలను ప్రచారం చేయవద్దని కోరారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా