ఆహార ఉత్పత్తిలో ఏపీ 3వ స్థానం : గౌతమ్‌రెడ్డి

22 Jun, 2020 17:14 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆహారత ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీదే అగ్రస్థానం అని తెలిపారు. సోమవారం ‘ఇన్వెస్ట్‌ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరమ్‌’ వెబ్‌ నార్‌లో మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడారు. వాణిజ్యానికి అయ్యే ఖర్చును మరింత తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆహార శుద్ధి రంగంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ముందంజలో ఏపీ కీలకమైనదని అన్నారు. ఏపీ పండ్లు, పాలు, కోడిగుడ్లు, రొయ్యలు, చిరు, తృణ ధాన్యాల భాండాగారం అని గుర్తుచేశారు.

ఏపీ 8 వేలకు పైగా ఆహార శుద్ధి పరిశ్రమలకు నెలవు అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన అనుబంధ పరిశ్రమలకు కొదవలేదని వెల్లడించారు. పారదర్శకంగా తక్కువ సమయంలోనే అన్ని పరిశ్రమలకు ఆన్‌లైన్‌లోనే అనుమతులు జారీ చేస్తున్నట్టు చెప్పారు. ఆహార  ఉత్పత్తికి కావాల్సిన అన్ని సదుపాయాలను రైతాంగానికి కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పంటలను కాపాడుకోవడానికి శీతల కేంద్రాలు, ఎగుమతి కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి వసతులు కల్పించామని గుర్తుచేశారు. 

మరిన్ని వార్తలు