‘ఆగిపోయిన వారిని పరీక్షించి అనుమతించాలి’

26 Mar, 2020 13:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్- తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఘటనల నేపథ్యంలో కొత్తగా ఎవరూ ప్రయాణాలు చేయకుండా చూడాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను కోరారు. అందరి క్షేమం కోసం దేశమంతా  లాక్ డౌన్‌గా ఉన్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండేలా చొరవ చూపాలని ఆయన తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు పయనమై కొంత మంది ఇంకా ఇబ్బందులు పడుతున్న అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి చెప్పారు. (రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎం జగన్‌)

గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఆగిపోయిన విద్యార్థులు, ప్రజలను తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి ఏపీ రాష్ట్రంలోకి అనుమతించేలా చూడాలని ఆయన అధికారులను కోరారు. గుంటూరు రూరల్ ఎస్పీ విజయ్ కుమార్‌తో మాట్లాడిన మంత్రి పరీక్షల అనంతరం అవసరమైతే సమీపంలోని క్వారంటైన్‌కు తరలి వెళ్లేందుకు సుముఖంగా ఉన్న వారందరినీ అనుమతించి, వారికి అత్యవసరమైన సదుపాయాలు అందించాలని సూచించారు. ఇకపై ఎవరూ, ఎక్కడికి ప్రయాణం చేయవద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. (44 మందిని క్వారంటైన్‌కు తరలింపు)

ఎటువంటి అత్యవసరమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలనుసారం మెలగడం ప్రతి పౌరుడి బాధ్యతని గౌతమ్‌రెడ్డి చెప్పారు. ప్రజలకు ఏ లోటు లేకుండా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. కరోనాను ఎదుర్కునేందుకు తమ కుటుంబాలు, ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల కోసం పని చేస్తున్న వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిబంధనలన్నీ.. ప్రజల బంధాలు దూరం కాకూడదనే, ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదని మంత్రి స్పష్టం చేశారు. (కరోనా.. రూ. 70 లక్షలు విరాళమిచ్చిన రామ్‌చరణ్‌)

కరోనా నేపథ్యంలో అశ్రద్ధతో ఒక్కరు బయటికి వచ్చినా తమతో పాటు ఎన్నో ప్రాణాలకు ముప్పు అని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. యువత అజాగ్రత్తగా ఉండకూడదని.. మిమ్మల్ని చూసి కుటుంబాలు, సమాజం ఆచరించే విధంగా ఆదర్శంగా ఉండాలని కోరారు. దయచేసి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య వార్తలను నమ్మవద్దని ఆయన చెప్పారు. సామాజిక దూరం తప్పక పాటించాలని, భయపడవద్దని ఇంట్లోనే ఉండాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు