60 లక్షల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లకు ఫైబర్ నెట్ సేవలు

15 Jul, 2020 19:21 IST|Sakshi

మంత్రి మేక‌పాటి గౌ‌త‌మ్ రెడ్డి

సాక్షి, అమ‌రావ‌తి: చౌకగా ఇంటర్నెట్‌తో పాటు, నాణ్య‌త‌గా ఫైబర్ నెట్ సేవలందించడమే ల‌క్ష్య‌మ‌ని పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్‌కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రానున్న 2-3 ఏళ్ల కాలంలో 60 లక్షల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లకు ఫైబర్ నెట్ సేవలు అందిస్తామ‌న్నారు. ఇప్ప‌టికే 10 లక్షల మందికి పైగా స‌బ్‌స్క్రైబర్లు ఉన్నార‌న్నారు. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా దశలవారీగా కొత్త స‌బ్‌స్క్రైబ‌ర్లను పెంచుతామ‌న్నారు. బుధవారం మంత్రి త‌న‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌)‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా గ్రామ పంచాయతీ, మండ‌లాల్లో రూటర్ల సంఖ్య వీలైనంతవరకూ తగ్గించడంపై దృష్టి పెడుతున్నామ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేలా చూడడానికి ప్రత్యేక చర్యలు చేప‌డుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. (ఫ్యాబ్రిక్‌ హబ్‌గా ఏపీ)

గ్రామీణ ప్రజలంద‌రికీ అందుబాటులోకి ఇంటర్నెట్ తెస్తామన్నారు. నిర్దేశించుకున్న గ్రామపంచాయతీలు, మండలాలలో పక్కాగా ఫైబర్ నెట్‌వ‌ర్క్‌ సేవలు అందుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. రూటర్ల ఇన్‌స్టాలేషన్‌లో మరింత పారదర్శకతతోపాటు, కొత్త పరికరాల సేకరణ, అంచనా, ఆర్థిక భారం తగ్గించేందుకు 'టెక్నికల్ కమిటీ' ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. (‘కనెక్షన్‌’ కింగ్: టీడీపీ అండ.. రూ.కోటి స్వాహా)

మరిన్ని వార్తలు