టెక్స్​టైల్​ హబ్​గా ఆంధ్రప్రదేశ్

10 Jul, 2020 20:39 IST|Sakshi

ఇన్వెస్ట్ ఇండియా ఫోరమ్ వెబినార్​లో మంత్రి మేకపాటి

సాక్షి, అమరావతి: రాష్ట్ర వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్​ను టైక్స్​టైల్​ హబ్​గా మారుస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్​ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర చేనేత మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభమైన ఇన్వెస్ట్ ఇండియా  వెబినార్​లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్ర టెక్స్​టైల్​ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు.(వైరల్‌ : ఇద్దరు యువతులను ఒకేసారి పెళ్లి..)

రాష్ట్రంలో ఉత్పత్తైన నూలును ఫాబ్రిక్​గా మార్చడం, గార్మెంట్స్, గ్లోబల్ టెక్స్‌టైల్ రంగానికి కేరాఫ్ అడ్రస్​గా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. దిగుమతి, ఎగుమతులు సహా పోర్టులకు సమీపంలో  కారిడార్ల ద్వారా రవాణా సంబంధిత అంశాలలో అనుసంధానం చేసి సహకరిస్తామని హామీ ఇచ్చారు. (సీఎఫ్‌ఓ ఔట్‌, 700 ఉద్యోగాలు కట్‌)

వస్త్రాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనా సంస్థల ఏర్పాటు, శిక్షణతో పాటు పరిశ్రమలతో సమన్వయం చేసుకోవటానికి తగిన ఆర్థిక, మౌలిక సదుపాయాలు, ఇతర ప్రోత్సాహక విధానాలను కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందిపుచ్చుకుంటామని వెల్లడించారు. చేనేత రంగాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. చేనేత రంగానికి సంబంధించిన గత ఏడేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను (సుమారు రూ.1300కోట్లు) ఈ ఏడాది చెల్లించనున్నట్లు తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్నంలోని బ్రాండిక్స్​కు పునాది వేశారని చెప్పారు. ప్రస్తుతం ఆ కంపెనీలో సుమారు 30వేల కుటుంబాలకు శాశ్వత ఉపాధి దొరుకుతోందని వెల్లడించారు. బ్రాండిక్స్​లో ఎక్కువగా మహిళలే పని చేస్తున్నారని మంత్రి తెలిపారు.

వరల్డ్​క్లాస్​ వర్క్​ఫోర్స్​
కొత్త పారిశ్రామిక విధానంతో వరల్డ్​క్లాస్ వర్క్ ఫోర్స్​ను తీసుకొస్తామని మంత్రి చెప్పారు. 30 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసి, ప్రతిభ, నైపుణ్యం కలిగిన సహజ మానవవనరులను సృష్టిస్తామని వెల్లడించారు. అన్ని రంగాలల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్​ను  శాశ్వత గమ్యస్థానంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు.

పరిపాలనలో విధానంలో కొత్త ఒరవడి సృష్టిస్తూ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలను, పారిశ్రామిక పాలసీ, ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక పరిపుష్ఠి కలిగించిన ప్రభుత్వ చర్యలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది వెబినార్​లో వివరించారు.

ఈ వెబినార్​లో కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్​కు చెందిన చేనేత శాఖ మంత్రులు, కేంద్ర టెక్స్ టైల్ శాఖ కార్యదర్శి రవి కపూర్, జాయింట్ సెక్రటరీ జోగి రంజన్ పాణిగ్రహి, ఇతర రాష్ట్రాల కార్యదర్శులు, 'ఇన్వెస్ట్ ఇండియా' సీఈవో, ఎండీ దీపక్ బగ్లా తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు