ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు తగదు

7 May, 2018 08:30 IST|Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అకారణంగా కేసులు పెట్టి, కక్ష సాధింపునకు దిగడం తగదని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు శాశ్వతంగా అధికారంలో ఉంటాయని అనుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వకర్తలతో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నాయకులపై ఎటువంటి కేసులు పెట్టినా చట్టం ద్వారా ఎదుర్కొంటామన్నారు. కొందరు తమ ఎమ్మెల్యేలు పెద్ద పొరపాటు చేసినట్లు భూతద్దంలో పెట్టి చూపించి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. 

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఎన్ని తప్పులు చేసినా చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకోని టీడీపీ ప్రభుత్వం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో రెండుసార్లు నోటీసులు అతనికి ఇచ్చారన్నారు. చట్టంపై గౌరవంగా విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు. ఇటీవల ఏడాది పాటు పాదయాత్ర కార్యక్రమాన్ని చేస్తుంటే కేసులు, చార్జిషీట్‌లు అంటూ వేధించడం సబబు కాదన్నారు.

 వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచి పద్ధది కాదన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమంగా కేసులు పెట్టి వేధించే సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కొత్తగా పెట్టినట్లు ఉందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై పెట్టిన అక్రమ కేసులను చట్టం ద్వారా ఎదుర్కొంటామన్నారు. నెల్లూరు రూరల్‌ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి లేవనెత్తిన విషయాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ బెట్టింగ్‌ కేసులో ఏ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ రామకృష్ణ చెప్పారన్నారు. తరువాత తమకు నోటీసులు జారీ చేశారన్నారు.

 చట్టంపై గౌరవంతో రెండు సార్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యానని గుర్తు చేశారు.    ఏడాది తరువాత గతేడాది కేసులో సంబంధం ఉందంటూ నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. తాను క్రికెట్‌ బుకీ కృష్ణసింగ్‌తో విజయవాడ హోటల్లో, కడప ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉన్నట్లు సీసీ పుటేజీ ఆధారాలు ఉన్నాయని తనపై పోలీసులు చార్జిషీట్‌ వేయడం జరిగిందన్నారు. కడప, విజయవాడకే కాకుండా దేశంలో ఎక్కడైనా హోటల్లో కృష్ణసింగ్‌ను తాను కలిసినట్లు ఆధారాలు చూపితే గంటలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. ఇటీవల నెల్లూరులో హత్యలు చేసిన ఓ సీరియల్‌ కిల్లర్‌ చంద్రబాబుతో ఫొటో కూడా దిగి ఉన్నారన్నారు. ఆ మాత్రన చంద్రబాబుకు, 

ఆ హత్యలకు సంబంధం ఉందా అంటూ ప్రశ్నించారు.  ఆధారాలు లేకుండా తన పరువుకు భంగం కలిగేలా పోలీసులు పత్రికలకు లీకులు ఇవ్వడం సరికాదన్నారు. దమ్ముంటే సీసీ పుటేజ్‌ను బయటపెట్టాలన్నారు. సమావేశంలో నగర, కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, జెడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వకర్త మేరిగ మురళీధర్, పార్టీ సీనియర్‌ నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి  తదితరలు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు