మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నాం

10 Dec, 2019 05:01 IST|Sakshi

అసెంబ్లీలో మహిళల భద్రత అంశంపై చర్చలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత

చర్చను అడ్డుకున్న టీడీపీ సభ్యులు.. ఉల్లి ధరలపై చర్చకు పట్టు

సాక్షి, అమరావతి: మహిళల రక్షణ, భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు సోమవారం మహిళా భద్రత అంశంపై స్వల్పకాలిక చర్చను ఆమె ప్రారంభించారు. మహిళల రక్షణ, కిశోర బాలికలను చైతన్యపరిచి వారికి సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. 11,158 గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శులు, 3,809 వార్డు మహిళా సంరక్షక కార్యదర్శులు కలిపి మొత్తం 14,967 ఉద్యోగాలు నోటిఫై చేశామన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించడానికి ‘మహిళా మిత్ర’ కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడం కోసం ‘సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ 9121211100’ ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై నేరాల కేసులను, జీరో ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే నమోదు చేసేలా పోలీసులకు సూచనలు ఇచ్చామని చెప్పారు. మహిళలపై నేరాల కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను 13 జిల్లాల్లో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటికి అదనంగా పోస్కో కేసుల పరిష్కారానికి 8 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు. 100, 112, 181 మహిళా హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. గృహ హింస నుంచి మహిళల సంరక్షణ, మహిళా శక్తి కేంద్రాలు, సమగ్ర శిశు సంరక్షణ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 

మహిళా భద్రత బిల్లుపై చర్చ జరుగుతుంటే ఏందయ్యా.. ఇది?
కాగా, ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ ఉదయం 11.43 గంటలకు మొదలైంది. మహిళా భద్రత అంశంపై స్వల్ప వ్యవధి చర్చను హోం శాఖ మంత్రి సుచరిత మొదలుపెట్టగా.. విపక్ష సభ్యులు ఉల్లి ధరలపై చర్చను చేపట్టాలని పట్టుబడుతూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘మహిళా భద్రత బిల్లుపై చర్చ జరుగుతుంటే ఏందయ్యా.. ఇది?’ అంటూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ చర్చకు సిద్ధమని ప్రకటించిన తర్వాత పోడియం వద్దకు వచ్చి ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోకుండా స్పీకర్‌ చైర్‌ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.

అధికార పక్షానికి చెందిన మహిళా సభ్యులంతా పోడియం వద్దకు చేరుకుని మహిళా భద్రత అంశంపై చర్చను అడ్డుకోవడమేంటని నినాదాలు చేశారు. ‘మహిళా వ్యతిరేకి చంద్రబాబు.. రౌడీ ప్రతిపక్షం’ అంటూ అధికార పక్ష సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నిరసన తెలిపారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ షాపులో కేజీ ఉల్లి రూ.200 అని.. చిత్తశుద్ధి ఉంటే ధర తగ్గించి విక్రయించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు గత ఐదేళ్ల పరిపాలనలో మహిళల్ని ఎలా వేధించారో బట్టబయలవుతుందనే భయంతో చర్చను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.  

>
మరిన్ని వార్తలు