మహిళలకు రక్షణ ‘మహిళా మిత్ర’..

21 Nov, 2019 14:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి ఎంత జరుగుతుందో మోసాలు సైతం అదేవిధంగా పెరిగిపోతున్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. టెక్నాలజీని తమ పిల్లలు ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఆమె సూచించారు. గురువారం విజయవాడలో  మహిత ప్లాన్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ‘మహిళలపై సైబర్‌ నేరాలు, తీసుకోవాల్సిన చర్యలు’పై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మహిళలపై సైబర్‌ నేరాలు’ పుస్తకాన్ని హోంశాఖ మంత్రి  ఆవిష్కరించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ..టెక్నాలజీ పెరిగిపోవడంతో మోసాలు చేసే వారి బారిన పడి మహిళలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసగాళ్లు రకరకాల వీడియోలు తీసి పిల్లలను బెదిరిస్తున్నారని, బ్యాంకు అకౌంట్ల ద్వారా మాయ చేస్తున్నారన్నారు. మహిళా మిత్ర ద్వారా మహిళలకు రక్షణ ఏర్పడుతుందని, ఒక ఫోన్‌కాల్‌ చేసి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించేలా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని హితవు పలికారు.
 


మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తాం
మహిళలపై జరిగే నేరాలు అదుపు చేసేందుకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. మహిళా మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. సైబర్‌ మిత్ర వల్ల ఏ మహిళ న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్‌ వరకు రానవసరం లేదని స్పష్టం చేశారు. మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తామని, స్పందన కార్యక్రమం ద్వారా 52 శాతం మంది మహిళలు ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. 

వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. టెక్నాలజీకి మంచి, చెడు రెండు వైపులా పదును ఉంటుందని, దురదృష్టవశాత్తు ఎక్కువ నేరపూరిరతవైపే టెక్నాలజీ వాడకం పెరిగిపోయిందని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని సోషల్‌ మీడియా ద్వారా ఆడవాళ్లపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, సైబర్‌ క్రైం వ్యవస్థ తమ శాయశక్తుల నేరాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు