వైఎస్సార్‌ కృషితో ఆ సమస్య తీరిపోయింది: హోంమంత్రి

20 Jul, 2019 13:26 IST|Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడ లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఫైర్ స్టేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో కొత్తగా ఫైర్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్‌లు ఉన్నాయని.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒకప్పుడు తాటాకు ఇల్లు ఎక్కువగా ఉండటం వల్ల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగేవని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రతి పేదవాడికి గృహ నిర్మాణం చేపట్టడంతో ఈ సమస్య చాలా వరకు తగ్గిందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు.

ఓఎంజీసీ వంటి గ్యాస్ ప్రాజెక్టులు ఉన్న చోట కూడా కొత్త స్టేషన్లు ఏర్పాటు చేస్తామని సుచరిత తెలిపారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు సహాయసహకారాలు అందించడానికి ఫైర్ సిబ్బంది ముందుంటారని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైర్‌ స్టేషన్‌లను త్వరలోనే పూర్తి చేస్తామని సుచరిత స్పష్టం చేశారు. అలాగే సిబ్బంది సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పరిష‍్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో వాటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు