12 సర్కిల్‌ స్టేషన్లను ప్రారంభించాల్సి ఉంది

15 Jul, 2019 11:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రాష్ట్రంలో కొత్త సర్కిల్‌ స్టేషన్ల అవశ్యకతపై ప్రభుత్వం దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. శిథిలావస్థలో ఉన్న స్టేషన్లను పునర్నించాలని పలువురు సభ్యులు కోరారు. తమ నియోజకవర్గాల్లో శిథిలావస్థకు చేరిన స్టేషన్ల పరిస్థితిని సభ దృష్టికి తెచ్చారు. నియోజవర్గానికి ఒక సర్కిల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజా సేవలో ఉండే పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా 12 సర్కిల్‌ స్టేషన్లు నిర్మించడం జరిగింది. వాటిని ప్రారంభించడమే మిగిలింది. ఐదు స్టేషన్‌లు నిర్మాణం పూర్తి కావడానికి దగ్గర్లో ఉన్నాయి. 12 సర్కిల్స్‌ స్టేషన్ల ప్రపోజల్స్‌ ఉన్నాయి. పలువురు సభ్యులు చెప్పిన ప్రపోజల్స్‌ తెప్పించుకుని పరిశీలిస్తాం. ఇప్పటికే పలు నగరాల్లో సర్కిల్‌ స్టేషన్ల నిర్మాణం జరుగుతుంద’ని తెలిపారు.

మరిన్ని వార్తలు